జీవీఎంసీ విస్తరణపై అధ్యయనం
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:07 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధి విస్తరణపై అధికారులతో కమిటీ ఏర్పాటువేసి అధ్యయనం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు.
అధికారులతో కమిటీ
రూ.60 కోట్లతో నగరంలో రహదారుల అభివృద్ధి
పరిశ్రమల కోసం జిల్లాలో ఐదు వేల ఎకరాలు గుర్తింపు
రూ.540 కోట్లతో మధురవాడలో మురుగునీరు శుద్ధి ప్లాంటు...త్వరలో టెండర్లు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధి విస్తరణపై అధికారులతో కమిటీ ఏర్పాటువేసి అధ్యయనం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. మూడు రోజుల క్రితం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఎమ్మెల్యేలు కొందరు గ్రామీణ ప్రాంతాన్ని జీవీఎంసీలో విలీనం చేయాలని కోరారన్నారు. అదే సమయంలో నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తరపున చేపట్టనున్న పనులను శనివారం తన ఛాంబర్‌లో విలేకరులకు వివరించారు.
విశాఖ జిల్లాలో 89 శాతం పట్టణ, 11 శాతం గ్రామీణ ప్రాంతంగా ఉందని, గ్రామీణ మండలాల్లో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల జనాభా ఉంటున్నట్టు కలెక్టర్ చెప్పారు. నాలుగు గ్రామీణ మండలాల పరిధిలో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయని పేర్కొంటూ...వాటిని నగరంలో విలీనం చేస్తే కలిగే ప్రయోజనాలు, తలెత్తే ఇబ్బందులు ఏమిటనే దానిపై దృష్టిసారించామన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద ఏటా 16 లక్షల పని దినాలు కల్పిస్తున్నామని, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 30 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా పద్మనాభం నగరానికి దూరంగా ఉందంటూ జీవీఎంసీ పరిధి విస్తరణపై అధ్యయనం కోసం కమిటీ వేస్తామన్నారు. విశాఖకు వచ్చే కంపెనీల కోసం ఐదు వేల ఎకరాలను గుర్తించనున్నామని అన్నారు.
ఈ ఏడాది నవంబరులో పెట్టుబడుల సదస్సు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఆర్ నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలో 26 ప్రధాన రహదారుల అభివృద్ధికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఇంకా సుందరీకరణ, కూడళ్లు విస్తరణ, అభివృద్ధి, లైటింగ్, ప్రధానంగా గుంతలు లేకుండా రోడ్లు మరమ్మతు చేయాలని, రోడ్లపై దుమ్ము లేకుండా నిరంతరం శుభ్రం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. నగరంలోని పార్కుల్లో లైటింగ్, నిర్వహణ, వచ్చే సందర్శకులకు వసతులు వంటివి మెరుగ్గా ఉండాలే చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరం నుంచి మురుగునీరు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. దీనిలో భాగంగా మధురవాడ ప్రాంతంలో రూ.540 కోట్లతో యూజీడీ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మించబోతున్నామని, త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత శుద్ధిచేసిన నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడం లేదా కంపెనీల అవసరాల కోసం విక్రయించడం చేస్తామన్నారు. ఇప్పటికే జీవీఎంసీ శుద్ధిచేసిన మురుగునీటిని హెచ్‌పీసీఎల్‌కు విక్రయిస్తోందని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు నగరంలో అన్నిరకాల వసతులు మెరుగుపరచేందుకు ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు కలెక్టర్ చెప్పారు.