షెడ్లలోనే చదువులు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:13 PM
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేక షెడ్లలో కొనసాగుతున్న దుస్థితి నెలకొంది. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే చదువుకుంటున్నారు.
మండలంలో 25 పాఠశాలలు తాత్కాలిక షెడ్లలో కొనసాగింపు
వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు
జి.మాడుగుల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేక షెడ్లలో కొనసాగుతున్న దుస్థితి నెలకొంది. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే చదువుకుంటున్నారు.
మండల వ్యాప్తంగా 202 ప్రభుత్వ పాఠశాలాలు ఉండగా, ఇందులో 25 పాఠశాలలకు సొంత భవనాలు లేవు. మరికొన్ని సొంత భవనాల్లో నిర్వహిస్తున్నా చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నాడు- నేడు పథకం కింద చేపట్టిన 63 పాఠశాలల భవన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పట్లో పనులు నిలిపివేశారు. బొయితిలి, కిల్లంకోట, వంతాల, గడుతూరు, పెదలోచలి, గెమ్మెలి, వంజరి, లువ్వాసింగి, పాలమామిడి పంచాయతీలలో అధిక శాతం పాఠశాలలకు భవనాలు లేకపోవడంతో ఉపాధ్యాయులే సొంత నిధులు వెచ్చించి తాత్కాలిక షెడ్లలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో షెడ్లు కారిపోతుండడంతో విద్యార్థులు తడిసిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనాలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఏఈవో బాబూరావు పడాల్ వివరణ కోరగా పాఠశాలలకు భవనాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు.