శిథిల షెడ్‌లో చదువులు
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:31 PM
అధికారుల నిర్లక్ష్యానికి మారుమూల గ్రామాల పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇక్కట్లు నడుమ విద్యనభ్యసిస్తున్నారు. అయినా విద్యాశాఖ, ఐటీడీఏ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ మండలంలోని గిన్నెల పంచాయతీ మారుమూల సబక ప్రభుత్వ పాథమిక పాఠశాలే నిదర్శనంగా చెప్పవచ్చు.
ఒకే గదిలో ఐదు తరగతులు
దెబ్బతిన్న పాఠశాల రెండు షెడ్ల పైకప్పులు
ఇబ్బంది పడుతున్న సబక పాఠశాల విద్యార్థులు
పట్టించుకోని ఐటీడీఏ, విద్యా శాఖాధికారులు
అరకులోయ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గిన్నెల పంచాయతీ సబక ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో సబక, కింటుబడి, చీడివలస గ్రామాలకు చెందిన 44 మంది బాల,బాలికలు చదువుతున్నారు. ఈ ఐదు తరగతులను శిథిలావస్థలో ఉన్న రేకులషెడ్‌లో ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల పైకప్పు రేకులకు రంధ్రాలు పడి వర్షాకాలంలో కారిపోతున్నది. ఈ పాఠశాలకు ఆనుకొని రెండు షెడ్లు ఉన్నాయి. కానీ వాటికి పైకప్పులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఈ షెడ్ల పైకప్పులు రహదారి నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ బండరాళ్లను బ్లాస్టింగ్ చేయడంతో పాడయ్యాయి. కొన్ని ఎగిపోగా వాటిని స్థానికులు పట్టుకుపోయారు. దీంతో గ్రామస్థులు కాంట్రాక్టర్‌ను గట్టిగా నిలదీయడంతో పాఠశాలకు చెందిన రెండు షెడ్ల రేకులు వేయిస్తానని హామీ ఇచ్చి తర్వాత వేయలేదు. దీంతో ఆ రెండు షెడ్లు విద్యార్థులకు ఉపయోగపడడంలేదు. ఇందులో ఒక షెడ్ గోడలు బాగున్నాయి, టైల్స్ ఫ్లోరింగ్ బాగుంది. పైకప్పుపై రేకులు వేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆ పనిని ఐటీడీఏ, విద్యా శాఖాధికారులు చేపట్టలేదు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఇక్కడ పనిచేసే టీచర్ వేరేచోటకు వెళ్లిపోయారు. అక్కడ టీచర్ కూడా లేకపోవడంతో గ్రామస్థుల వత్తిడి మేరకు మూడు రోజుల క్రితమే సీఆర్‌టీని ఐటీడీఏ అదికారులు నియమించారు. టీచర్, విద్యార్థులు ఉన్నప్పటికీ శిథిల రేకులషెడ్‌లో విద్యా బోధన చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి రెండు షెడ్లపై రేకులు వేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.