ఇద్దరు వైద్య విద్యార్థుల బలవన్మరణం
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:15 AM
చదువులో తీవ్ర ఒత్తిడితో ఒకరు, బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేననే ఆందోళనలో మరొకరు...జిల్లాలో ఒకేరోజు ఇద్దరు వైద్య విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
భవనాల మీద నుంచి దూకి ఆత్మహత్య
చదువులో తీవ్ర ఒత్తిడే కారణం
ఎండాడ/పెందుర్తి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
చదువులో తీవ్ర ఒత్తిడితో ఒకరు, బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేననే ఆందోళనలో మరొకరు...జిల్లాలో ఒకేరోజు ఇద్దరు వైద్య విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన విస్మాద్‌సింగ్ (20) నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ప్రాంగణంలోని హాస్టల్ (ఆరో అంతస్థు)లో ఉంటున్నాడు. బుధవారం ఉదయం తాను ఉంటున్న అంతస్థు నుంచి పదో అంతస్థుకు వెళ్లి, అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ఇది చూసిన సిబ్బంది వెంటనే కళాశాలకు చెందిన ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు బలమైన గాయమవ్వడంతో అప్పటికే మృతిచెందాడు. చదువు ఒత్తిడి తట్టుకోలేక, లోకం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు పంజాబీ భాషలో రాసిన లేఖ హాస్టల్‌లోని అతడి గదిలో లభించినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి హిమాచల్‌ప్రదేశ్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నారని, ఆయనకు సమాచారం అందించామని కళాశాల యాజమాన్యం తెలిపింది. దీనిపై కేసు నమోదు చేయనున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. మెడికల్ కళాశాల విద్యార్థి బలవన్మరణం చెందడం చాలా బాధాకరమని కళాశాల ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ భోగవల్లి కార్తీక్ పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన చింతల దేవుడు, గౌరి దంపతుల కుమార్తె శివాని జ్యోత్స్న (21) శివారు ప్రాంతంలో గల కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రథమ సంవత్సరంలో బ్యాగ్‌లాగ్స్ ఉండిపోయాయి. వాటిని క్లియర్ చేయడంలో భాగంగా చదువుకునేందుకు ఈనెల 15న సుజాతనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న తన మేనమామ ఇంటికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ముభావంగానే ఉండేది. బ్యాక్‌ల్యాగ్స్ గురించి ఆలోచిస్తూ తీవ్ర ఒత్తిడితో ఆందోళన చెందుతుండేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏడు గంటలకు చదువుకుంటానంటూ అపార్ట్టుమెంట్ టెర్రస్ ఎక్కింది. కొంతసేపటి తరువాత టెర్రస్ మీద నుంచి కిందకు దూకేసింది. అకస్మత్తుగా పెద్ద శబ్దం రావడంతో సెల్లార్‌లో వాకింగ్ చేస్తున్నవారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే పెందుర్తి సీహెచ్‌సీకి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెందుర్తి పూర్వపు తహశీల్దారు సహా పలువురిపై క్రమశిక్షణ చర్యలు
విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండల పూర్వ తహశీల్దారు, మరికొంతమంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు 2021 జూలై 20 నుంచి 22 తేదీల మధ్య పెందుర్తి తహశీల్దారు కార్యాలయంలో తనిఖీలు చేశారు. కార్యాలయంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. దీని ప్రకారం ఏసీబీ డీజీకి విశాఖలోని ఏసీబీ అధికారులు నివేదిక సమర్పించారు. ఏసీబీ డీజీ సూచన మేరకు అప్పటి పెందుర్తి తహశీల్దారు పైల రామారావు, డిప్యూటీ తహశీల్దారు డి.శ్రీను, మండల సర్వేయర్ ఎస్.రాజగోపాల్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ డి.ఈశ్వరరావు, వీఆర్వోలు డి.ఆనందకుమార్, జి.శామ్యూల్, జి. పెంటూరి, ఎన్.స్వాతి, బి.రమేష్‌నాయుడు, జి.దేవరాజ్, బి.కిరణ్‌లపై క్రమశిక్షణ చర్యలకు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి సూచించారు.
బార్‌లకు ఆదరణ నిల్
63 బార్‌లకు రెండోసారి నోటిఫికేషన్ జారీ
కేవలం 11 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు
నేడు వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో లాటరీ ద్వారా కేటాయింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్‌లకు ఆదరణ కరువైంది. తొలిదశ నోటిఫికేషన్‌లో భర్తీకాని బార్లకు రెండోసారి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుకు గడువు బుధవారంతో ముగిసింది. అయితే కేవలం 11 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు రావడంతో వాటికి గురువారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో లాటరీ నిర్వహించనున్నారు.
జిల్లాలో 121 బార్ అండ్ రెస్టారెంట్‌లను ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసింది. బార్‌ల కేటాయింపు లాటరీ విధానంలో చేపట్టేలా గత నెలలో నోటిఫికేషన్ జారీచేసింది. ఒక్కోబార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలని, లేనిపక్షంలో లాటరీ నిర్వహించరాదని నిబంధన విధించింది. అయితే కొత్తబార్‌పాలసీ వ్యాపారులకు పెద్దగా అనుకూలంగా లేకపోవడంతో వ్యాపారులు ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపలేదు. జిల్లాలో 121 బార్‌లకు నోటిఫికేషన్ జారీచేస్తే 58 బార్‌లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు రావడంతో వాటికి లాటరీ నిర్వహించారు. మిగిలిన 63 బార్‌లకు ఇటీవల రెండోసారి నోటిఫికేషన్ జారీచేయగా కేవలం 11 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు వచ్చాయి. దీంతో మరో 52 బార్‌లు కేటాయింపునకు నోచుకోని పరిస్థితి ఏర్పడింది. నాలుగేసి దరఖాస్తులు వచ్చిన 11 బార్లను కేటాయించేందుకు గురువారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో లాటరీ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే విశాఖ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు బార్‌లకు దరఖాస్తులు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందువల్లే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కంటే విశాఖ జిల్లాలో అత్యధికంగా బార్‌ల కేటాయింపు జరిగింది.