Share News

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:45 AM

విద్యార్థులందరూ కష్టపడి చదివి సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆకాంక్షించారు.

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

  • షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి

  • బట్టీ చదువులకు స్వస్తి పలకాలి: ఎంపీ శ్రీభరత్‌

  • 121 మందికి రూ.24,20,200 అందజేత: కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

సిరిపురం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) :

విద్యార్థులందరూ కష్టపడి చదివి సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆకాంక్షించారు. సోమవారం ఏయూ అసెంబ్లీ హాల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం నిర్వహించిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఆయన విశిష్ట అతిథులు ఎంపీ శ్రీభరత్‌, కలెక్టర్‌ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌, ఎమ్మెల్యే పి.గణబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, డీఈవో ఎం.ప్రేమ్‌కుమార్‌తో కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన డ్రీమ్‌, గ్రాటిట్యూడ్‌ వాల్స్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదింటి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా షైనింగ్‌ స్టార్స్‌-2025 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వారం రోజుల్లో తల్లికి వందనం నిధులను జమ చేస్తామన్నారు.

గురుకులాల్లో ఐఐటీ, నీట్‌ శిక్షణ

ఇంటర్‌ విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది నుంచి ఎస్సీ గురుకులాల్లో ఐఐటీ, నీట్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తామని మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఇప్పటికే మూడు కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మరో ఏడు కేంద్రాల్లో త్వరలో తరగతులు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారని, ఆయనతో పాటు నగరవాసులు, విద్యార్థులు యోగాలో భాగస్వాములు కావాలని కోరారు.

ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ బట్టీ చదువులకు విద్యార్థులు స్వస్తి పలకాలని సూచించారు మార్కులపై మమకారాన్ని వీడి కాన్సెప్ట్‌ ఓరియండెట్‌పై విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. మార్కులే జీవితం కాదని.. వాటి కోసం పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయవద్దన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ బృహత్తరమైన షైనింగ్‌ స్టార్‌ అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఫలితాల సాధనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మండలానికి ఆరుగురి చొప్పున మొత్తం 121 మందిని ఎంపిక చేశామని, వీరిలో టెన్త్‌కు సంబంధించి 83 మంది, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 38 మంది ఉన్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.24,20,000 అందజేశామన్నారు. డీఈవో ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. జేసీ కె.మయూర్‌ ఆశోక్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు శ్రీనివాసులరెడ్డి, మధుసూదనరావు, ఏపీసీ జె.చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:45 AM