సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తిప్పలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:06 AM
కాలేజీలు ఫీజులు చెల్లిస్తే తప్ప విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అంగీకరించడం లేదు.
ఏయూ పరిధిలో సుమారు 30కి పైగా కళాశాలలకు సమస్య
లైబ్రరీ ఫండ్, అప్ల్లియేషన్ ఫీజు చెల్లించకపోవడమే కారణం
రిజిస్ర్టేషన్ చేయించుకున్న వారందరి ఫీజులూ చెల్లించాలని మెలిక
ధ్రువపత్రాల కోసం వర్సిటీని ఆశ్రయిస్తున్న విద్యార్థులు
బకాయిలు చెల్లిస్తేనే పంపిస్తామంటున్న అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):
కాలేజీలు ఫీజులు చెల్లిస్తే తప్ప విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అంగీకరించడం లేదు. ఇది విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం ఏయూ పరిధిలోని సుమారు 30కుపైగా కాలేజీలు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులు చెల్లించే ఫీజుల్లో కొంత మొత్తాన్ని కాలేజీలు వివిధ ఫీజుల రూపంలో వర్సిటీకి చెల్లిస్తుంటాయి. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ కాకపోవడంతో అనేక కాలేజీలు వర్సిటీకి ఫీజులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వస్తున్నాయి. కానీ, ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు మాత్రం సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యాలను కోరుతున్నారు. సదరు కాలేజీ యాజమాన్యాలు స్పందించకపోవడంతో నేరుగా వర్సిటీని సంప్రతిస్తున్నారు. అటువంటి విద్యార్థులకు సదరు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెండింగ్ ఉన్న విషయాన్ని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఆయా ఫీజులను చెల్లించిన తరువాత సర్టిఫికెట్లను కాలేజీలకు పంపిస్తామని చెబుతుండడంతో ఏమీ చేయలేని స్థితిలో విద్యార్థులు ఉంటున్నారు.
నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తేనే...
ఏయూ పరిధిలో సుమారు 300 వరకు కాలేజీలు (డిగ్రీ, పీజీ) ఉన్నాయి. ఆయా కాలేజీల్లో సుమారు 40 వేల మంది చదువుతున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులను చెల్లిస్తోంది. విద్యార్థికి ప్రభుత్వం చెల్లించే ఫీజుల్లో కొంత మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలు వివిధ రకాల ఫీజుల రూపంలో వర్సిటీకి చెల్లిస్తుంటాయి. లైబ్రరీ ఫండ్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు, కల్చరల్, కరిక్యులమ్, అఫ్లియేషన్ వంటి పీజులు ఉంటాయి. ఇవన్నీ చెల్లించిన కాలేజీలకు యూనివర్సిటీ అధికారులు నో డ్యూ సర్టిఫికెట్‌ను ఇస్తుంటారు. నో డ్యూ సర్టిఫికెట్‌ను కాలేజీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీడీసీ) ఇస్తుంది. అయితే, కొన్నిరకాల కారణాలతో అనేక కాలేజీలు కొన్ని ఫీజులను చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు సర్టిఫికెట్లను ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఇది విద్యార్థులకు ఇబ్బందిగా మారుతోంది.
డ్రాప్ అయిన విద్యార్థులు ఫీజు
ప్రస్తుతం డిగ్రీ అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే రెండో విడత అడ్మిషన్స్ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. ఇక్కడ ఒక సమస్య డిగ్రీ కాలేజీలను వేధిస్తోంది. సాధారణంగా కాలేజీల్లో చేరిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులను ఆయా కాలేజీలు యూనివర్సిటీకి చెల్లించడం పరిపాటి. అయితే, ఏయూ అధికారులు అందుకు భిన్నంగా రిజిస్ర్టేషన్ చేయించుకున్న విద్యార్థులందరి ఫీజులను కాలేజీ యాజమాన్యాలే చెల్లించాలని కోరుతున్నాయి. అదే ఇప్పుడు యాజమాన్యాలకు ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు నగర పరిధిలోని ఒక డిగ్రీ కాలేజీలో చేరేందుకు 150 మంది విద్యార్థులు ఆసక్తి చూపించి రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. అయితే, వారిలో చాలామంది రిజిస్ర్టేషన్ చేయించుకున్న కాలేజీల్లో కాకుండా ఇతర కాలేజీల్లో చేరిపోయారు. అయితే, చేరిన కాలేజీల నుంచి కాకుండా రిజిస్ర్టేషన్ చేయించుకున్న కాలేజీలు ఫీజులు చెల్లించాలని ఏయూ అధికారులు కోరుతున్నారు. ఒక్కో విద్యార్థికి సుమారు వేయి రూపాయలు వరకు చెల్లించాల్సి రావడంతో కాలేజీలకు భారంగా మారుతోందని చెబుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రత్యేక డెస్క్
దరఖాస్తు చేసుకునేందుకు 31వ తేదీ వరకూ అవకాశం
వీఎంఆర్‌డీఏ చైర్మన్, కమిషనర్ ప్రకటన
విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):
అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి వీఎంఆర్‌డీఏలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్‌లో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. 2025 జూన్ 30లోపు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల(ఇళ్ల స్థలాలు)ను మాత్రమే ఈ పథకంలో క్రమబద్ధీకరిస్తారు. నిర్ణీత ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకుంటే ఆయా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. భవిష్యత్తులో లావాదేవీలకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మొత్తాలు బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రిజిస్ట్రేషన్ పత్రాలతో నేరుగా గానీ, లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ)తో గానీ దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్-2020 పథకానికి కొనసాగింపుగా వీఎంఆర్‌డీఏ ఈ అవకాశం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్, కమిషనర్ సంయుక్త ప్రకటనలో కోరారు.