సీబీఐకి విద్యార్థిని కేసు
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:33 AM
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీట్ విద్యార్థిని మృతి కేసు నగర పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశం
నగర పోలీస్ వర్గాల్లో గుబులు
నీట్ శిక్షణ కోసం నగరంలోని కార్పొరేట్ కళాశాలలో చేరిన పశ్చిమ బెంగాల్ విద్యార్థిని
2023 జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి
ఫోర్త్‌టౌన్ స్టేషన్ పరిధిలో ఘటన
కల్పబుల్ హోమిసైడ్ (304 పార్ట్ 11)గా కేసు నమోదు
హత్య కేసుగా నమోదుచేయాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్
పశ్చిమ బెంగాల్ సీఎం ఆదేశాల మేరకు అక్కడ కేసు నమోదు
తాజాగా సీబీఐకి అప్పగింత
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీట్ విద్యార్థిని మృతి కేసు నగర పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సీబీఐకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నాడు కేసును దర్యాప్తు చేసిన అధికారుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని నీట్ కోచింగ్ కోసం 2022లో నరసింహనగర్‌లోని ఆకాశ్ బైజూస్ ఆధ్వర్యంలో నడుస్తున్న అచీవర్స్ (ఆకాశ్) కాలేజీలో చేరింది. బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ దొండపర్తిలోని ప్రైవేటుహాస్టల్ (సాధన హాస్టల్)లో ఉండేది. విద్యార్థిని 2023 జూలై 14వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్ గది నుంచి టెర్రస్‌పైకి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ ఐపాడ్, చెప్పులతోపాటు కొన్ని దుస్తులను టెర్రస్ రక్షణ గోడపై ఉంచి కిందకు పడిపోయింది. అయితే రాత్రి 12.40 గంటల సమయంలో విద్యార్థిని కిందపడి పోయినట్టు హాస్టల్ వార్డెన్ సూర్యకుమారి, వాచ్‌మన్‌గా ఉన్న ఆమె భర్త గుర్తించి ఫోర్త్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ స్టేషన్ జీడీ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసి ఘటనా స్థలానికి వెళ్లారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినిని సమీపంలోని వెంకటరమణ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ రాజేష్ చికిత్స అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు మరుసటిరోజు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి విద్యార్థినిని కేర్ ఆస్పత్రికి తరలించారు. 17న చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై ఫోర్త్‌టౌన్ పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు తమ కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ‘ఎవరో ఆమెను కిందకు తోసేసి ఉంటారని’ హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు అందజేశారు. హత్యాయత్నం జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 174 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్టు విలేకరుల సమావేశంలో అప్పటి సీపీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ హాస్టల్‌లోని నాలుగు సీసీ కెమెరాలతోపాటు పక్కనే ఉన్న సంఘవి లామినేషన్స్‌కు చెందిన సీసీ కెమెరాల్లో కూడా రికార్డయినందున వాటి ఆధారంగా కేసు నమోదుచేసి, దర్యాప్తు జరిపామని ప్రకటించారు. నగర పోలీసుల దర్యాప్తు సరిగా లేదని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడ సీఎం మమతాబెనర్జీని కలిసి ఫిర్యాదు చేయడంతో నేతాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో మరొక కేసు నమోదుచేసి తర్వాత పశ్చిమ బెంగాల్ సీఐడీకి కేసు దర్యాప్తును బదిలీ చేశారు. దీంతో నగర పోలీసులు అప్రమత్తమై ఫోర్త్ టౌన్‌లో 174 సెక్షన్ కింద నమోదుచేసిన కేసును, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతాచర్యల లోపం కారణంగా బాలిక మృతిచెందినట్టు గుర్తించి 304 పార్ట్ 2గా మార్చారు. హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్‌తోపాటు ఆకాష్ బైజూస్ సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లను నిందితులుగా చేర్చి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విషయమై పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు పలుమార్లు నగరానికి వచ్చి పోలీస్ అధికారులతో మాట్లాడడంతోపాటు బాలిక మృతిచెందిన హాస్టల్ భవనాన్ని, కాలేజీని కూడా పరిశీలించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బాలిక తల్లితండ్రులు ఏపీ హైకోర్టుని ఆశ్రయుంచారు. దీనిపై ఏపీ, పశ్చిమ బెంగాల్‌లో వేర్వేరుగా కేసులు నమోదైనందున సీబీఐకి అప్పగించాలని తాము ఆదేశించలేమని హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. అలాగే ప్రైవేటు విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు వీలుగా నిపుణులైన కౌన్సెలర్లను నియమించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విద్యార్థిని కేసు దర్యాప్తు మొదలుపెడితే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని, అప్పట్లో ఈ కేసు దర్యాప్తుతో సంబంధం కలిగిన అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.