Share News

ఏయూలోవిద్యార్థుల ఆందోళన

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:21 AM

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు ఉన్నాయంటూ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో హాస్టల్‌ విద్యార్థులు వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. తెల్లవారుజాము వరకూ నిరసన కొనసాగించారు.

ఏయూలోవిద్యార్థుల ఆందోళన

హాస్టళ్లు, క్యాంపస్‌లో సమస్యలు

వీసీ కార్యాలయం ఎదుట బైఠాయింపు

నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేలా చర్యలు చేపడతామన్న వైస్‌ చాన్సలర్‌

టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి

మెస్‌ల నిర్వహణకు స్టూడెంట్‌ కమిటీలు

విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు ఉన్నాయంటూ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో హాస్టల్‌ విద్యార్థులు వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. తెల్లవారుజాము వరకూ నిరసన కొనసాగించారు. బుధవారం ఉదయం హాస్టళ్లు, తరగతి గదుల వద్దకు వెళ్లి మరింత మంది విద్యార్థులను కూడగట్టారు. అనంతరం ర్యాలీగా వైస్‌ చాన్సలర్‌ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. అధికారుల నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. భోజనంలో పురుగులు వస్తున్నా, విద్యార్థులు సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైస్‌ చాన్సలర్‌ స్వయంగా సమస్యలు చెప్పాలంటూ విద్యార్థుల మధ్యకు వెళ్లి కూర్చున్నారు. నాణ్యమైన భోజనం పెట్టాలని, వసతి గృహాల్లో బెడ్స్‌ ఏర్పాటు చేయాలని, క్యాంపస్‌లో వై-ఫై సదుపాయం కల్పించాలని, మహిళల వసతి గృహాల్లోకి పాములు, పురుగులు రాకుండా మెష్‌లు ఏర్పాటుచేయాలని కోరారు. విద్యార్థుల డిమాండ్‌లపై వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ వర్సిటీలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. కొన్ని హాస్టళ్లలోని మెస్‌లలో డైనింగ్‌, ఇతర పనులు చేశామని, మిగిలిన వాటిల్లో కూడా పూర్తి చేస్తామన్నారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేలా చర్యలు చేపడతామని, ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మెస్‌ నిర్వహణకు స్టూడెంట్‌ కమిటీలు ఏర్పాటుచేస్తామని, ఇందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. ఆయా సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తామన్న దానిపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ధనుంజయరావు, సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎంవీఆర్‌ రాజు విద్యార్థులతో చర్చలు జరిపారు. నెలరోజుల్లో మెజారిటీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.

Updated Date - Jul 24 , 2025 | 01:21 AM