Share News

పాఠశాల ఈతకొలనులో విద్యార్థి మృతి

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:06 AM

మండలంలోని తిమ్మరాజుపేటలో వున్న డావిన్సీ స్కూల్‌లో ఈతకొలనులో పడి విద్యార్థి మృతిచెందాడు. అయితే పాఠశాల నిర్వాహకులు ఈ విషయాన్ని గోప్యంగా వుంచి, మిగిలిన విద్యార్థులను యథావిధిగా ఇళ్లకు పంపించేశారు. బాలుడి మృతిదేహాన్ని ఈతకొలను పక్కన వదిలేసి, స్కూలుకు తాళాలు వేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

పాఠశాల ఈతకొలనులో విద్యార్థి మృతి
మోక్షిత్‌సందీప్‌ (ఫైల్‌ఫొటో)

గోపంగా ఉంచిన యాజమాన్యం

కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు

పాఠశాలకు ఫోన్‌.. స్పందన లేకపోవడంతో హుటాహుటిన స్కూల్‌కు చేరిక

స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన బాలుడి మృతదేహం

యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపాటు

పాఠశాల నిర్వాహకులు రావాలంటూ ఆందోళన

మునగపాక, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిమ్మరాజుపేటలో వున్న డావిన్సీ స్కూల్‌లో ఈతకొలనులో పడి విద్యార్థి మృతిచెందాడు. అయితే పాఠశాల నిర్వాహకులు ఈ విషయాన్ని గోప్యంగా వుంచి, మిగిలిన విద్యార్థులను యథావిధిగా ఇళ్లకు పంపించేశారు. బాలుడి మృతిదేహాన్ని ఈతకొలను పక్కన వదిలేసి, స్కూలుకు తాళాలు వేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. స్కూలు బస్సులో పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి, చిన్న కుమారుడు రాకపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనతో పాఠశాలకు వెళ్లారు. అక్కడ విగతజీవిగా పడివున్న కుమారుడిని చూసి భోరున విలపించారు. పాఠశాల నిర్వాహకులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

ఎలమంచిలికి చెందిన జనపరెడ్డి శ్రీలత, శ్రీనివాసరావు దంపతులకు ప్రశాంత్‌, మోక్షిత్‌ సందీప్‌ కుమారులు. శ్రీనివాసరావు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇటీవల సెలవుపై వచ్చి, గురువారం తిరిగి బయలుదేరి వెళ్లారు. కాగా పిల్లలను మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డావిన్సీ స్కూలులో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ఆరో తరగతి, చిన్న కుమారుడు మొదటి తరగతి చదువుతున్నారు. రోజూ ఎలమంచిలి నుంచి స్కూలు బస్సులో వచ్చి వెళుతుంటారు. గురువారం సాయంత్రం ఇంటికి స్కూల్‌ బస్సులో పెద్ద కుమారుడు ఒక్కడే వచ్చాడు. తమ్ముడు ఏడని తల్లి అడగ్గా.. బస్సు ఎక్కలేదని చెప్పాడు. దీంతో ఆందోళన చెందుతూ స్కూల్‌కు ఫోన్‌ చేశారు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో సందీప్‌ తల్లి, పెదనాన్న, కుటుంబీకులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లారు. సందీప్‌ గురించి అక్కడ వున్న వాచ్‌మన్‌ను అడిగితే తనకేమీ తెలియదన్నాడు. తరగతి గదులతోపాటు ఆవరణలో వెతికారు. చివరకు స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన సందీప్‌ పడివుండడాన్ని చూశారు. దగ్గరకు వెళి పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. దీంతో వారు కన్నీరుమున్నీరు అయ్యారు. విద్యార్థి చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరచకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా వుంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పి.ప్రసాదరావు, సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు వచ్చారు. కొద్దిసేపటికి సీఐ, తహశీల్దారు, ఎంఈవోలు చేరుకున్నారు. పాఠశాల నిర్వాహకులకు ఫోన్లు చేశారు. కానీ అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. స్కూల్‌ అద్దాన్ని పగలు గొట్టారు. ఎస్‌ఐ వారిని వారించి, పాఠశాల నిర్వాహకులను రప్పిస్తామని, అంతవరకు సంయమనం పాటించాలని కోరారు. కానీ పాఠశాల నిర్వాహకులను వెంటనే ఇక్కడకు రప్పించాలని, అంతవరకు కదిలేదంటూ పాఠశాల ఎదురుగా వున్న అనకాపల్లి- అచ్యుతాపురం మెయిన్‌ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 12.30 గంటల సమయానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

Updated Date - Nov 14 , 2025 | 01:06 AM