Share News

ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:40 AM

అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ కృష్ణాపురం కాలనీ ప్రధాన రహదారిపై ఆటో బోల్తా పడిన ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆకస్మికంగా రోడ్డుపైకి వచ్చిన పందిని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడినట్టు డ్రైవర్‌ చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రాఫిక్‌ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
ఆంటోని ఆకాశ్‌

అడ్డుగా వచ్చిన పందిని తప్పించే క్రమంలో ప్రమాదం

ముగ్గురు ప్రయాణికులకు గాయాలు

కొత్తూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ కృష్ణాపురం కాలనీ ప్రధాన రహదారిపై ఆటో బోల్తా పడిన ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆకస్మికంగా రోడ్డుపైకి వచ్చిన పందిని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడినట్టు డ్రైవర్‌ చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రాఫిక్‌ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలిలా వున్నాయి.

కొత్తూరు పంచాయతీ రామాపురం కాలనీకి చెందిన క్రిస్టోఫర్‌, ఉషా దంపతులకు కుమారుడు ఆంటోని ఆకాశ్‌(14), కుమార్తె అనీషా ఉన్నారు. ఇద్దరూ ఏఎంఏఏ హైస్కూల్‌లో చదువుతున్నారు. రోజూ ఇంటి నుంచి ఆటోలో పాఠశాలకు వెళ్లివస్తుంటారు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లేందుకు అన్న, చెల్లెలు ఆటో ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తరువాత కృష్ణాపురం వద్ద ఆటోకు అడ్డుగా పంది వచ్చింది. దీంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆకాశ్‌పై ఆటో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆటోను పక్కకు తీసి, ఆకాశ్‌ను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఆటోలో ప్రయాణిస్తున్న అనీషా, మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎం.శ్రావణి, ట్రాఫిక్‌ సీఐ వెంకటనారాయణ పరిశీలించారు. కాగా ఆకాశ్‌ నేత్రాలను విశాఖ ఐ బ్యాంకుకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:40 AM