బాల్య వివాహాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:41 PM
బాల్య వివాహాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.

కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
పాడేరు, జూన్ 10(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సుండ్రుపుట్టు అంగన్‌వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు, బాలికల విద్య, పోషకాహారం, కెరీర్ గైడెన్స్, రుతుక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిషోర బాలికలకు మంగళవారం నిర్వహించిన కిశోర వికాసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను బాలికలు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. కౌమార దశలో రక్త హీనతకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ పి.ఝాన్సీరాణి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డాక్టర్ సద్దు, స్థానిక ఎంపీడీవో రతన్‌తేజ, ఎంఈవో సీహెచ్ సరస్వతి, ఈవోఆర్‌డీ రమేశ్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.