ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:22 PM
జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశం
హెల్మెట్ ధరించకుంటే కేసులు నమోదు చేయండి
ప్రమాదాల స్పాట్‌ల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి
అవసరమైన చోట బస్‌షెల్టర్లు నిర్మించండి
పాడేరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడేరు, అరకులోయ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌కు సరైన ప్రదేశాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలుపుదల చేస్తున్నారని, ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. అలాగే హెల్మెట్ వాడకం పెరగాలని, రోడ్లపై చెత్తాచెదారాన్ని పడేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్రదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే వారికి జరిమానాలు విధించాలని, మితి మీరితే లైసెన్సులు రద్దు చేయాలన్నారు. అలాగే జాతీయ రహదారి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అవసరమైన ప్రదేశాల్లో బస్ షెల్టర్లు నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎస్‌పీ నవజ్యోతి మిశ్రా, జిల్లా రవాణాధికారి కేవీ.ప్రకాశరావు, భవనాలశాఖ ఈఈ బాల సుందరంబాబు, ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ నరేన్‌కుమార్, ఆర్‌టీసీ, నేషనల్ హైవే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.