గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:19 AM
జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
ఎస్‌పీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం
పాడేరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం గంజాయి నిర్మూలనపై ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు, వినియోగంపై అధికారులకు పక్కా సమాచారం ఉండాలని, జిల్లాలో గంజాయి సాగు చేయడానికి ఎవరూ సాహసించకూడదన్నారు. అలాగే గ్రామ స్థాయిలో గంజాయి స్థితిగతులపై అధికారులు సర్వే చేపట్టి, దశల వారీగా నిర్మూలనపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. గంజాయి సాగుతో కలిగే నష్టాలపై ప్రజలకు, వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజనుల్ని గంజాయి సాగు నుంచి విముక్తి చేసి, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో, ఇతర విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలపై ప్రణాళికా బద్ధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వాటిని మండల విద్యాశాఖాధికారులు, సహాయ గిరిజన సంక్షేమ శాఖాధికారులు బాధ్యతగా పర్యవేక్షించాలన్నారు. గంజాయిని వీడిన గిరిజన రైతులకు స్వయం ఉపాధి కల్పన, బ్యాంకు రుణాలు మంజూరు మంజూరు చేయాలన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. విద్యాలయాల్లో స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటుతో పాటు ఫిర్యాదుల పెట్టెలు పెట్టాలన్నారు. మండలానికి ఒకటి చొప్పున యూత్ క్లబ్‌లను ఏర్పాటు చేసి యువతను సానుకూల దృక్పథం వైపునకు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదికర్మ యోగి సేవా కేంద్రాల్లోని సిబ్బందికి గంజాయి సాగు, రవాణాను గుర్తించేలా అవసరమైన శిక్షణలు అందించాలని గిరిజన సంక్షేమ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్‌పీ అమిత్‌బర్ధార్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి వ్యవహారాల్లో సంబంధాలున్న వారి బంధువులపైనా తాము నిఘా పెట్టామన్నారు. గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని, గంజాయి స్మగ్లర్లకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రతి చోటా పటిష్ఠ నిఘా పెట్టామని, ఈ క్రమంలో అందరూ గంజాయికి దూరంగా ఉండాలని ఎస్‌పీ సూచించారు. ఈ సందర్భంగా ఈగిల్ రూపొందించిన పోస్టర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో పి.అంబేడ్కర్, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా గ్రామీణాభివృద్ధికి సంస్ధ పీడీ వి.మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, ఎల్‌డీఎం మాతునాయుడు, ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్, జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి ఎస్.భీమశంకరరావు, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా నోడల్ అధికారి జి.గౌరిశంకరరావు, ఈగల్ బృందం, అటవీ, వెలుగు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.