Share News

బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్నతికి కృషి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:24 PM

ఆదివాసీ యోధుడు భగవాన్‌ బిర్సాముండా ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్నతికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు.

బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్నతికి కృషి
మాట్లాడుతున్న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ

విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట

రూ.కోట్లలో నిధులు విడుదల చేస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ

ఘనంగా బిర్సాముండా జయంత్యుత్సవాలు

పాడేరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ యోధుడు భగవాన్‌ బిర్సాముండా ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్నతికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. బిర్సాముండా 150వ జయంత్యుత్సవాల్లో భాగం స్థానిక కాలేజీ మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రోడ్డు, రవాణా వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు గిరిజనుల జీవనోపాధి మరింతగా పెంపొందించేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్‌ ఆత్మ గౌరవానికి సూచికని, మన్యం వీరుడిగా ఆదివాసీ గుండెల్లో చెరగని ముద్ర వేశాన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి దేశ వ్యాప్తంగా 780 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసి లక్షా 38 వేల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, సికిల్‌సెల్‌ ఎనీమియా నిర్మూలన మిషన్‌ ద్వారా గిరిజనుల ఆరోగ్య రక్షణకు చ ర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.16 వేల 650 కోట్ల రుణాలు అందించామని, దేశంలో మూడు వేల వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా లక్షా 23 వేల మంది గిరిజనులకు అటవీ ఉత్పత్తుల విలువ పెంపు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 24 లక్షల గిరిజన కుటుంబాలకు అటవీ హక్కు పత్రాలను అందించి వారి సాగు భుములకు హక్కులు కల్పించామని, దేశంలో 10 చోట్ల గిరిజన మ్యూజియంలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఒకటి లంబసింగిలో నిర్మాణంలో ఉందన్నారు. అలాగే గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాలైన అరకు, కొరాపుట్‌ కాఫీకి ప్రపంచ ఖ్యాతి లభించిందని, దానిని మరింత ప్రమోట్‌ చేస్తున్నామని తెలిపారు.

గిరిజనులకు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు

గిరిజనుల కోసం రంపచోడవరం, పార్వతీపురం, డోర్నాల, సీతంపేటల్లో వంద పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వలన పాడేరులోని మెడికల్‌ కాలేజీ నిర్మాణం సకాలంలో పూర్తికాలేదని, ఎన్‌డీఏ ప్రభుత్వం దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అలాగే పార్వతీపురంలోని మెడికల్‌ కాలేజీ నిర్మాణంపైనా దృష్టి సారిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌.మాధవ్‌ మాట్లాడుతూ బిర్సాముండా ఉద్యమ స్ఫూర్తితో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అభివృద్ధికి నోచని గ్రామాలపై దృష్టి సారించాలని, ఆయా ప్రాంత గిరిజనుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, వివిధ గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనలను ఒడిశా సీఎం తిలకించారు. అలాగే బీజేపీ నేతలు ఒడశా సీఎం మోహన్‌ చరణ్‌ను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, జీసీసీ చైర్మన్‌ కిడారి శావ్రణ్‌కుమార్‌ ఆర్‌టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర, ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ బుజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు, జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:24 PM