‘ప్రాథమిక’ వైద్యంపై సమ్మెట!
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:06 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సమ్మెబాట పట్టడంతో గ్రామాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు.
డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టిన పీహెచ్‌సీల వైద్యులు
రెండు వారాల నుంచి విధులకు గైర్హాజరు
ఆస్పత్రుల్లో నిలిచిన వైద్య సేవలు
అధికారులు అరకొరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఆయూష్, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి డిప్యూటేషన్‌పై నియామకం
రోగులకు పూర్తిస్థాయిలో అందని వైద్య సేవలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సమ్మెబాట పట్టడంతో గ్రామాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు.
జిల్లాలో 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో ఇద్దరు చొప్పున వైద్యులు వుంటారు. అయితే 110 మందికిగాను ప్రస్తుతం 107 మంది వైద్యులు వున్నారు. ఒక్కో ఆస్పతికి రోజుకు సగటున వంద మంది చొప్పున రోగులు వస్తుంటారు. కాగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు పలు డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా సీట్లు 20 శాతానికి పెంచి అన్ని స్పెషలైజేషన్ కోర్సుల్లో అమలు చేయాలి, టైమ్ బౌండ్ ప్రమోషన్ల అమలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్‌పై 50 శాతం ప్రత్యేక భృతి, నోషనల్ ఇన్‌క్రిమెంట్లు మంజూరు, తదితర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ సరైన స్పందన లేదంటూ గత నెల 28వ తేదీ నుంచి సమ్మెకు దిగారు. దీంతో పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. వచ్చిన రోగులకు స్టాఫ్ నర్సులు తమ స్థాయిలో సేవలు అందించి మందులు ఇచ్చి పంపుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, ఆయుష్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో కొంతమందిని పీహెచ్‌సీలకు డిప్యూటేషన్‌పై నియమించారు. అయితే వీరిలో ఎక్కువమంది హోమియో, ఆయుర్వేద, యూనానీ వైద్యులు కావడంతో రోగులకు అత్యవసర అల్లోపతి వైద్య సేవలు అందడం లేదు. మరోవైపు సచివాలయాల పరిధిలో నిర్వహించే పత్యేక వైద్య శిబిరాలు ఆగిపోయాయి.