గర్భస్థ శిశు లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - May 06 , 2025 | 11:20 PM
గర్భస్థ శిశు లింగనిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గర్భస్థ శిశు లింగనిర్ధారణ చట్టంపై మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు
తుమ్మపాల, మే 6 (ఆంధ్రజ్యోతి) : గర్భస్థ శిశు లింగనిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గర్భస్థ శిశు లింగనిర్ధారణ చట్టంపై మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం లింగ నిష్పత్తి వెయ్యి మంది బాలురు, 972 మంది బాలికలుగా ఉందని చెప్పారు. లింగ నిష్పత్తి అంతరం అధికంగా ఉన్న మండలాల్లో సీడీపీవోలు మరింత సమర్థంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆడ శిశువులు, బాలికలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్‌లపై నిఘా పెట్టాలని, గర్భస్థ శిశు లింగ వివరాలను బహిర్గతం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావం చేయిస్తున్నట్టు సమాచారం అందితు వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 102, 104లకు తెలియపరచాలని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శాంతిప్రభ మాట్లాడుతూ, తమ శాఖ ద్వారా బాలికల సంరక్షణపై విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మోహనరావు, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ పీడీ అనంతలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు బాలాజీ, కేవీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.