విద్యార్థుల ఆరోగ్యాన్ని అలక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:59 PM
గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏఎన్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరిక
ఆశ్రమాల్లో సిక్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం
ప్రతి నెలా ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశం
పాడేరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏఎన్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, ప్రజారోగ్యంపై వైద్య, విద్య, పంచాయతీరాజ్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అనారోగ్యంగా ఉన్న వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలన్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వలన విద్యార్థులు మృతి చెందకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఆస్పత్రులు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు మరణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై విద్యార్థులు మరణిస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హెల్త్ రికార్డుపై ఉపాధ్యాయులు, వైద్యులకు అవగాహన ఉండడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాల నిర్వహణకు సూక్ష్మ కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రాష్ట్రీయ బాల సురక్ష పుస్తకంలో విద్యార్థి ఆరోగ్య వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, కాస్ల్ టీచర్, డాక్టర్, సూపర్‌వైజరీ అధికారులు ఆర్‌బీఎస్ పుస్తకంలో సంతకం చేయకుంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో మోనటరింగ్ సెల్ ఏర్పాటు
విద్యార్థుల ఆరోగ్య సేవలు అందించే అంశాలను పర్యవేక్షించేందుకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలపై వైద్యాధికారులను ప్రశ్నించారు. గోమంగి మినీ గురుకులంలో ఎంత మందికి సికిల్‌సెల్ ఎనీమియా స్ర్కీనింగ్ చేశారని, ఎటువంటి మందులు ఇస్తున్నారని ఆరా తీశారు. సికిల్‌సెల్ ఎనీమియా పిల్లలకు అదనపు పోషకాహారం అందించాలని, సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు అన్ని పాఠశాలల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సిక్‌రూమ్ ఏర్పాటు చేయాలని, అందులో ఉన్న విద్యార్థుల వివరాలు, అందించిన మందులు వివరాలు విధిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేశామని, సెల్ సిగ్నల్ అందుబాటులో ఉన్నచోట నుంచి ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో హాజరు వేయడానికి అవసరమెనౖ యంత్ర పరికరాలు సరఫరా చేశామని, వాటిని పాఠశాలల్లో ఏర్పాటు చేసి అటెండెన్స్ వేయాలని ఆదేశించారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు టీచర్ల అటెండెన్స్‌ను పర్యవేక్షించాలని, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటే మండల విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంకా 4,500 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉందన్నారు. ఈ నెల 5న వారందర్నీ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. పదవ తరగతి పాసైన విద్యార్థులను జూనియర్ కళాశాలల్లో చేర్పించాలన్నారు. గ్రామాల్లోని తాగునీటి వనరులు క్లోరినేషన్ చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. మలేరియా, డెంగ్యూ , చికెన్‌గున్యాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల మందు పిచికారీ అందరి సమన్వయంతో సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి రోజు గ్రామాల్లో పర్యటించి వైద్య సేవలు అందించాలన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కె.లక్ష్మి, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టీఎన్.ప్రతాప్, సికిల్ సెల్ ఎనీమియా నోడల్ అధికారి డాక్టర్ బాబ్జీ, జిల్లా మలేరియా అధికారి తులసి, వైద్యాధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.