Share News

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 17 , 2025 | 10:49 PM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో టి.విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. గురువారం ఆయన పెదబయలు మండలంలోని పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అడుగులపుట్టు ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పెదబయలు మండలం అడుగులపుట్టు ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రంలో మందులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు

పెదబయలు పీహెచ్‌సీ, అడుగులపుట్టు ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

అడుగులపుట్టు ఎంఎల్‌హెచ్‌పీకు చార్జి మెమో జారీ

పెదబయలు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో టి.విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. గురువారం ఆయన పెదబయలు మండలంలోని పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అడుగులపుట్టు ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ముందుగా అడుగులపుట్టు ఆయుష్మాన్‌ కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారి అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టిన ఎంఎల్‌హెచ్‌పీ డి.మౌనికాలతకు చార్జ్జి మెమో జారీ చేశారు. అనంతరం పెదబయలు పీహెచ్‌సీలో రికార్డులను తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. వార్డులోని రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్‌ నిఖిల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా డిప్యూటీ డెమో బి.లక్ష్మణ్‌, ఆరోగ్య విస్తరణాధికారి జి.సింహాద్రి, పర్యవేక్షకులు ఎం.సంజీవ్‌ పాత్రుడు, తదితరులు ఉన్నారు

ముంచంగిపుట్టు మండలంలో..

ముంచంగిపుట్టు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు అన్నారు. మండలంలోని కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించి రికార్డులను, ల్యాబ్‌, మందుల గదిని పరిశీలించారు. పీహెచ్‌సీలో ల్యాబ్‌ను పరిశీలించి అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలో నమోదైన మలేరియా కేసుల వివరాలను అడుగగా, పొంతనలేని సమాధానం చెప్పడంతో కిలగాడ పీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఆయన ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించి, సీహెచ్‌సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులతో ఆయన సమావేశం అయ్యారు. వ్యాధులు విజృంభించకుండా ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాట్లుపై చర్చించారు. అలాగే నవ జాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)ను సందర్శించి అప్పుడే పుట్టిన బిడ్డలకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.గీతాంజలి, డాక్టర్‌ జె.శేఖర్‌, లబ్బూరు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్యాంప్రసాద్‌, జిల్లా డిప్యూటీ డెమో బి.లక్ష్మణ్‌, ఆరోగ్య విస్తరణాధికారి జి.సింహాద్రి, జిల్లా ఆరోగ్య పర్యవేక్షకులు ఎం.సంజీవ్‌ పాత్రుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 10:49 PM