Share News

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 19 , 2025 | 11:31 PM

స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు.

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై సమీక్ష

రోగులను రిఫర్‌ చేసే క్రమంలో వైద్యులు, అంబులెన్సు డ్రైవర్లు అలక్ష్యంగా ఉంటే క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆదేశం

పాడేరు, మే 19(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై సోమవారం ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రధానంగా రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేసే క్రమంలో వైద్యులు, అంబులెన్సు డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల రోగులు మృతి చెందితే బాధ్యులపై క్రిమినల్‌ కే సులు పెట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వైద్య సేవలు, చికిత్సల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, రిఫరల్‌, ఇతర సమయాల్లోనూ రోగులు మృతి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్న రోగికి సంబంధించిన పూర్తి వివరాలతో కేస్‌షీట్‌ ఉండాలని, ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేసే క్రమంలో అది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ ప్రతి రెండు వారాలకు ఒక మారు ఆస్పత్రి పనితీరుపై సమావేశం నిర్వహించాలని, డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సమన్వయంతో వ్యవహరించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఆయన పలు వార్డులను సందర్శించి రోగులను పరిశీలించి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఒక బాలికకు రక్తం అవసరమని గుర్తించి, రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా సమకూర్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌బాషా, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలత, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వామిత్ర, ఆర్‌ఎంవో డాక్టర్‌ సురేశ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధి పి.సూర్యారావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:31 PM