మన్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:55 AM
మన్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా చాలా కాలంగా ఖాళీగా ఉన్న తహశీల్దార్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు మొత్తం తహశీల్దార్ పోస్టులన్నీ భర్తీ
ఏడాదిన్నరగా కేవలం మూడు చోట్లే శాశ్వత తహశీల్దార్లు
ఎనిమిది మండలాల్లో డిప్యూటీ తహశీల్దార్లకే ఇన్‌చార్జి బాధ్యతలు
తాజాగా ఉమ్మడి జిల్లాలో 13 మంది డీటీలకు పదోన్నతులు కల్పించి ఏజెన్సీలో నియామకం
గిరిజనులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందే అవకాశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా చాలా కాలంగా ఖాళీగా ఉన్న తహశీల్దార్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు చర్యలు చేపట్టారు.
ఏజెన్సీలోని మొత్తం పదకొండు మండలాలకు కేవలం పాడేరు, అరకులోయ, జీకేవీధి మండలాల్లో మాత్రమే శాశ్వత తహశీల్దార్లు ఉండగా, మిగిలిన ఎనిమిది మండలాల్లోనూ ఏడాదిన్నర పైబడి డిప్యూటీ తహశీల్దార్లే ఇన్‌చార్జి తహశీల్దార్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీలో తహశీల్దార్ల పోస్టుల భర్తీకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా తహశీల్దార్లుగా పదోన్నతులు పొందిన 13 మంది డిప్యూటీ తహశీల్దార్లను ఏజెన్సీకి కేటాయించారు. దీంతో వారిని ఖాళీగా ఉన్న మండలాల్లో తహశీల్దార్లుగా నియమిస్తూ కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంతా నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇటీవల బదిలీల్లో ఏజెన్సీ ప్రాంతానికి రాని తహశీల్దార్లు
ఏజెన్సీలో పాడేరు, అరకులోయ, జీకేవీధి మండలాల్లో మాత్రమే శాశ్వత తహశీల్దార్లు ఉండగా, మిలిగిన జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో డిప్యూటీ తహశీల్దార్లే ఇన్నాళ్లుగా తహశీల్దార్లుగా ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. అయితే శాశ్వత తహశీల్దార్లు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందకపోవడంతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన అధికారిక పనుల్లోనూ కాస్త జాప్యం జరిగేది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన బదిలీల్లోనూ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లుగా వచ్చేందుకు ఎవరూ సుముఖత చూపలేదు. ఆఖరు నిమిషంలో కొయ్యూరు మండలానికి మాత్రమే వచ్చారు. దీంతో బదిలీల ప్రక్రియలో సైతం ఇక్కడ తహశీల్దార్ పోస్టులు భర్తీ కాని పరిస్థితి నెలకొంది.
డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులతో మోక్షం
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పలువురు డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు రావడంతో ఎట్టకేలకు ఏజెన్సీలోని తహశీల్దార్ల పోస్టుల భర్తీకి మోక్షం కలిగింది. అనకాపల్లి జిల్లాలో పదోన్నతులు పొందిన 13 మందిని ఏజెన్సీకి కేటాయించడంతో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించారు. వారిలో జి.ఆనందరావును చింతపల్లి తహశీల్దార్‌గా, డి.లక్ష్మయ్యను కలెక్టరేట్‌కు, వి.శ్రీనివాసరావును హుకుంపేటకు, కె.ప్రసాదరావును కలెక్టరేట్‌కు, కె.వీరబ్రహ్మాచారిని అనంతగిరికి, డి.అరుణ్‌చంద్రను పాడేరుకు, ఇక్కడ తహశీల్దార్ వి.త్రినాథరావునాయుడును పెదబయలుకు, హెచ్.అన్నాజీరావును జీకేవీధి, అక్కడి తహశీల్దార్ రామకృష్ణను విశాఖపట్నం జిల్లాకు, ఐ.వెంకట అప్పారావును అరకులోయకు, అక్కడి తహశీల్దార్ ఎంవీవీ.ప్రసాదరావును విశాఖపట్నం జిల్లాకు, ఎ.సంధ్యను పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఏవోగా, హెచ్.త్రివేణిని డుంబ్రిగుడకు, కె.శంకరరావును ముంచంగిపుట్టుకు, జి.రాజ్‌కుమార్‌ను జి.మాడుగులకు తహశీల్దార్లుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపుగా ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వం శాశ్వత తహశీల్దార్లే ఉండడంతో ఇకపై గిరిజనులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.