ఆరోగ్యం, పోషకాహార సేవలు బలోపేతం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:54 PM
యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో జిల్లాలో ఆరోగ్యం, పోషకాహార సేవలు బలోపేతం చేయాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశం
పాడేరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో జిల్లాలో ఆరోగ్యం, పోషకాహార సేవలు బలోపేతం చేయాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. యునిసెఫ్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అంగన్‌వాడీ, పాఠశాలల్లో చిన్నారులు, విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం, పోషకాహార సేవలను మరింతగా బలోపేతం చేయాలన్నారు. అలాగే రక్త హీనత కలిగిన చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలన్నారు. యునిసెఫ్ బహుళ ప్రయోజనాలు కలిగేలా అందిస్తున్న సేవలను విద్య, వైద్యం, శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య విద్య, వైద్య సేవలు, పోషకాహారం అందిస్తుండగా, పాఠశాలల్లోని విద్యార్థులు డ్రాపవుట్ కాకుండా అవసరమైన చర్యలను చేపడుతున్నారన్నారు. అయితే ఆయా సేవలు సమర్థవంతంగా లబ్ధిదారులకు అందేలా ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ ప్రతినిధుల బృందం అధినేత డాక్టర్ జీతలెం తాపెస్సే, పోషకాహార నిఫుణులు డాక్టర్ ఖ్యాతి, బాలల సంరక్షణాధికారి డాక్టర్ మురళీకృష్ణ, స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి, డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి.ప్రతాప్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
భూ సంబంధిత సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో భూ సంబంఽధిత సమస్యలపై ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో పీవో తిరుమణి శ్రీపూజ మంగళవారం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భూముల రీ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, డి.పట్టా భూములను సంపూర్ణంగా పరిశీలించి వెబ్ ల్యాండ్‌లో డివిజన్, సబ్ డివిజన్ చేయాలన్నారు. ఒకమారు చేపట్టిన ప్రక్రియపై మళ్లీ ఫిర్యాదులు, అభ్యంతరాలు రాకుండా చూడాలన్నారు. పట్టా చేసినప్పుడు పూర్తిగా పరిశీలించి మాత్రమే ఆ పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ధి పొందడానికి సంబంధిత పత్రాలు లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం కాకూడదని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని, వాటిపై మండల స్థాయిలో తహశీల్దార్లు శ్రద్ధ చూపాలని సూచించారు.