Share News

అనకాపల్లిలో వీధి కుక్కల బెడద

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:32 PM

పట్టణంలోని రహదారులపై శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడి చేసి కరుస్తున్నాయి.

అనకాపల్లిలో వీధి కుక్కల బెడద
కుక్క కాటుకు గురైన శ్రావణజ్యోతి

ఒకే రోజు రెండుచోట్ల మహిళలపై దాడి

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

స్పందించిన జీవీఎంసీ అధికారులు

కుక్కలను నిర్బంధించి.. సంతాన నిరోధక శస్త్రచికిత్సలు

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రహదారులపై శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడి చేసి కరుస్తున్నాయి. మంగళవారం కోట్నివీధిలో కోట్ని శ్రావణజ్యోతిపై కుక్క దాడి ముఖంపై పలుచోట్ల కరిచింది. ఆమెకు ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. లక్ష్మీనారాయణనగర్‌లో కూడా ఒక మహిళపై కుక్క దాడి చేసి, చేతిపై కాటు వేసింది. కుక్కల బెడదను నివారించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక సుంకరమెట్ట జంక్షన్‌ సమీపంలో ‘యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. పట్టణంలో కుక్కలను పట్టుకుని ఇక్కడ శస్త్రచికిత్స చేసిన దాఖలాలు లేవు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కుక్కల దాడిలో గాయపడిన వారిలో జూన్‌లో 246 మంది, జూలైలో 285 మంది, ఆగస్టులో 259 మంది ఎన్టీఆర్‌ వైద్యాలయంలో యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కాగా పట్టణంలో కుక్కల బెడదపై జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవరిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఇటీవల కాలంలో కుక్కలను పట్టుకున్న దాఖలాలు లేవని, అనకాపల్లిలో యాంటీ బర్త్‌ కంట్రోల్‌ కేంద్రం ఉన్నప్పటికీ దానిని వినియోగించుకోవడం లేదన్నారు. కోట్నివీధిలో మహిళపై కుక్క దాడి చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని పారిశుధ్య విభాగం అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. దీంతో మంగళవారం సాయంత్రం గాజువాక నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బంది.. పట్టణంలో పలుచోట్ల కుక్కలను బంధించి, వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 11:32 PM