వీధి కుక్కల ఏరివేత
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:32 AM
వీధి కుక్కల నియంత్రణపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు. జనవరి నాటికి బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్ద వీధి కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు జీవీఎంసీ ప్రణాళిక
నగరంలో జనసమర్థ ప్రాంతాలు 1,365 వరకూ గుర్తింపు
జాబితాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు, క్రీడా మైదానాలు
రక్షణ గోడల నిర్మాణం, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటుచేసుకోవాలంటూ ఆయా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు
ఆ ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వీధి కుక్కల నియంత్రణపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు. జనవరి నాటికి బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్ద వీధి కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో 1,365 ప్రాంతాల్లో వీధి కుక్కలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని గుర్తించిన అధికారులు...ఆయా సంస్థల యాజమాన్యాలు/నిర్వాహకులు/అధికారులకు నోటీసులు జారీచేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వీధికుక్కల కాటుకు గురై ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీధికుక్కల నియంత్రణ ఆవశ్యకతను సుప్రీంకోర్టు గుర్తించింది. నిత్యం వందలాది మంది రాకపోకలతో సందడిగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు, క్రీడా మైదానాలు వంటి ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా ఏరివేయడంతోపాటు భవిష్యత్తులో ప్రాంగణాల్లోకి ప్రవేశించడానికి వీల్లేకుండా రక్షణ గోడల నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం జంతు ప్రేమికులు, ఎన్జీవోల సహాయం తీసుకోవాలని పేర్కొంది. ఆయా పనులను పర్యవేక్షించే బాధ్యతలను స్థానిక సంస్థలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎనిమిది వారాలు గడువు ఇస్తూ గత నెల ఏడున ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో వీధి కుక్కలు లేకుండా చేయాల్సిన పబ్లిక్ ప్రాంతాలను గుర్తించి, బాధ్యులైన అధికారులు/యాజమాన్యాలకు నోటీసు జారీచేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ సంపత్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్ స్టేషన్లు, క్రీడా మైదానాలు, పార్కులు వంటి రద్దీగా ఉండే 1,365 ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 1.8 లక్షల కుక్కలు ఉన్నట్టు అంచనా వేస్తున్న అధికారులు, ప్రస్తుతం గుర్తించిన 1,365 ప్రాంతాల్లో సుమారు 20 వేల వరకూ ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆయా సంస్థలు, కార్యాలయాల పరిసరాల్లోకి వీధికుక్కలు చొరబడకుండా రక్షణ గోడ నిర్మించడం లేదంటే ఫెన్సింగ్ వేయడం, వీధికుక్కల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ప్రతి సంస్థ/కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమించడం, కుక్కకాటుకు గురైనవారికి తక్షణం ప్రథమ చికిత్స అందజేసేలా ఏర్పాట్లుచేసుకోవడం, వీధికుక్కల నియంత్రణ, ఒకవేళ కుక్కకాటుకు గురైతే వెంటనే చేయాల్సిన పనులపై సంస్థ/కార్యాలయంలోని సిబ్బంది, విద్యార్థులు, వినియోగదారులకు అవగాహన కల్పించడం వంటివి జనవరి ప్రారంభం నాటికి చేపట్టేలా చూడాలని జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్ల కమిషనర్లు, ఏఎంహెచ్ఓలు నోటీసులు జారీచేస్తున్నారు.
వీధి కుక్కల సంరక్షణకు ఏర్పాట్లుపై దృష్టి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకొస్తే వాటిని ఉంచేందుకు వీలుగా ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం కుక్కలను పట్టుకునేందుకు ఏడు వాహనాలు ఉండగా, అదనంగా మరో ఎనిమిది వాహనాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అలాగే ప్రస్తుతం వెటర్నరీ విభాగంలో 107 మంది సిబ్బంది పనిచేస్తుండగా వీధి కుక్కలన్నింటినీ పట్టుకుని వచ్చి పునరావాస కేంద్రాల్లో ఉంచితే వాటిని సంరక్షించేందుకు అదనంగా వంద మంది వరకూ సిబ్బంది అవసరమవుతారంటున్నారు. కుక్కలను పునరావాస కేంద్రాల్లో ఉంచడానికి అవసరమైన కెన్నెల్స్ కొనుగోలు కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపించినట్టు చీఫ్ వెటర్నరీ అధికారి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలైతే వీధికుక్కల సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.