లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభం
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:05 AM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ మార్కెట్‌లో 200 గ్రాములు రూ.100లకు విక్రయిస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో తొమ్మిదేళ్లుగా గిరిజన, కౌలురైతులు స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు.
200 గ్రాములు రూ.100ధరకు విక్రయం
చింతపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ మార్కెట్‌లో 200 గ్రాములు రూ.100లకు విక్రయిస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో తొమ్మిదేళ్లుగా గిరిజన, కౌలురైతులు స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు. కేవలం పర్యాటక సీజన్‌లో విక్రయాలు నిర్వహించేందుకు అనువుగా పంటను పండిస్తున్నారు. ఈఏడాది లంబసింగి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగవుతోంది. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది దిగుబడులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో రైతులు పండ్లను సేకరించి విక్రయిస్తున్నారు. ప్రధానంగా లంబసింగి, రాజుపాకలు, చిట్రాళ్లగొప్పు గ్రామాల ప్రధాన రహదారికి ఇరువైపులా స్టాల్స్ ఏర్పాటుచేసి స్ట్రాబెర్రీలు విక్రయిస్తున్నారు. లంబసింగి వచ్చే పర్యాటకులు తాజాగా కోసిన పండ్లను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. మెజారిటీ విక్రయాలు స్ట్రాబెర్రీ తోటల్లోనే జరుగుతున్నాయి. సీజన్ ప్రారంభంలో వచ్చే దిగుబడులను రైతులు స్థానిక మార్కెట్‌లోనే దిగుబడులను విక్రయిస్తున్నారు.