గిరిజన గ్రామాల్లో వింత పురుగులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:29 PM
మండలంలోని పెదవలస పంచాయతీలో గల ఆరు గ్రామాల్లో వింత పురుగులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నెల రోజుల క్రితం తక్కువగా కనిపించిన పురుగులు ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో వేల సంఖ్యలో పెరిగిపోయాయి.
కాఫీ తోటల నీడ వృక్షాలపై తిష్ఠ
అవస్థలు పడుతున్న గిరిజనులు
గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదవలస పంచాయతీలో గల ఆరు గ్రామాల్లో వింత పురుగులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నెల రోజుల క్రితం తక్కువగా కనిపించిన పురుగులు ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో వేల సంఖ్యలో పెరిగిపోయాయి. కాఫీ తోటల్లో నీడనిచ్చే చెట్లు, గ్రామాల్లో ఉన్న చెట్లపై ఈ పురుగులు తిష్ఠ వేశాయి. ఈ పురుగులు తాకితే శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ఆదివాసీలు చెబుతున్నారు. నెల రోజుల క్రితం చాపరాతిపాలెం, రంపుల, డోకులూరు, బందవీధి, కొక్కితపాడు, పెదవలస గ్రామాల్లో ఈ పురుగులు కనిపించాయి. అయితే కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారీ సంఖ్యలో పురుగులు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ ఆరు గ్రామాల్లో ఎక్కడ చూసినా గొంగలి పురుగు మాదిరిగా ఉన్న ఈ పురుగులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు కాఫీ తోటల్లోకి వెళ్లలేకపోతున్నారు. కాఫీ తోటలకు వెళ్లిన గిరిజనులు బయటకు వచ్చే సరికి శరీరం మొత్తం దద్దుర్లు వస్తున్నాయి. ఈ పురుగులు ఇళ్లు, తాగునీటి బావుల్లోనూ కనిపిస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పురుగుల బారి నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు.