Share News

అనగనగా...

ABN , Publish Date - May 25 , 2025 | 01:03 AM

‘‘అనగనగా ఒక రాజు...ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్లారు.

అనగనగా...

- కథలతో చిన్నారుల్లో మనోవికాసం

-ఏకాగ్రతను, జిజ్ఞాసను పెంచడంలో కథలు కీలకంగా నిలుస్తాయంటున్న నిపుణులు

- భాషపై పట్టు పెరగడంతోపాటు విశ్లేషణాత్మక గుణం అలవడేందుకు అవకాశం

- ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌ నుంచి దూరంగా ఉంచేందుకు, మంచి నిద్రను అందించేందుకు దోహదం

- తల్లిదండ్రులు సమయం వెచ్చించడం అవసరం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘అనగనగా ఒక రాజు...ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్లారు. ఏడు చేపలు తెచ్చారు...’’ ఇలా ఒకప్పుడు పిల్లలకు అమ్మమ్మో, నానమ్మో, తాతయ్యో చందమామను చూపిస్తూ కథలు చెప్పేవారు. అలా కథలు వింటూనే పిల్లలు నిద్రపోయేవారు. కథలు నిద్ర పుచ్చడానికి మాత్రమే కాదు, పిల్లల్లో జిజ్ఞాసను, ఊహాశక్తిని పెంపొందించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లోని పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి పెద్దవాళ్లు కథలు చెప్పేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలు, వ్యాపారాల్లో నిమగ్నమయ్యే తల్లిదండ్రులు...పిల్లలతో గడిపేందుకు సమయం కూడా కేటాయించడం లేదు. ఇక, కథలు చెప్పడానికి అవకాశం ఎక్కడ?. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్లు ఇచ్చి...పరోక్షంగా వారు మానసిక సమస్యల బారినపడేలా చేస్తున్నారు.

కథలు పిల్లల మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు చెప్పే కథలు కొన్ని ఏళ్లపాటు పిల్లల మెదళ్లలో కదలాడుతుంటాయి. రోజువారీ చెప్పే కథలు పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందించడంతోపాటు భాషా వికాసానికి ఉప యోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

వ్యక్తిత్వ వికాసానికి దోహదం

పిల్లలకు ప్రతిరోజూ ఒక మంచి కథను చెప్పడం వల్ల వ్యక్తిత్వ వికాసం సాధ్యపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కథలు చెప్పేటప్పుడు పిల్లల ధ్యాస పూర్తిగా కథపైనే ఉంటుంది. కాబట్టి, వారి ఏకాగ్రత పెరుగుతుంది. ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇదే ఆసక్తి తరువాత చదువుపైనా పెరిగేందుకు కథలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, పదేళ్లలోపు మాత్రమే కథలు వినడానికి ఆసక్తి చూపిస్తారని, ఆలోగానే పిల్లలకు తల్లిదండ్రులు ఆ అలవాటు చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. కథల వల్ల పిల్లల్లో ఊహాశక్తి కూడా మెరుగవుతుంది.

ఓపిక పెరిగే అవకాశం

ప్రస్తుతం పిల్లల్లో ఎవరైనా చెబితే వినే ఓపిక ఉండడం లేదు. కథలు చెప్పడం వల్ల చిన్నతనం నుంచి వినే ఓపిక పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కథలను వినిపించే అలవాటు వల్ల పిల్లలు ఎవరైనా ఏదైనా చెబితే వినేందుకు ఆసక్తి చూపిస్తారు. పూర్తిగా విన్న తరువాత వాటిపై స్పందించే గుణం కూడా అలవడుతుందని పేర్కొంటున్నారు. వినడం, తరు వాత స్పందించడం అన్నది ఏ వయసులో వారికి అయినా అత్యంత కీలకం. అవతలి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినకుండా స్పందించడం అన్నది అనేక అనర్థాలకు దారితీస్తుంది. కథలు చెప్పడం ద్వారా వినే ఓపికను పెంచేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అనేక సంస్థలు..

స్టోరీ టెల్లింగ్‌ను హాబీగా మార్చుకుంటున్న యువత కూడా ఉన్నారు. ప్రస్తుతం వివిధ సంస్థల ఆధ్వర్యంలో స్టోరీ టెల్లింగ్‌ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నారు. అనేక స్కూల్స్‌ కూడా స్టోరీ టెల్లర్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. అయితే బయట ఇతరులు చెప్పే స్టోరీల కంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చెప్పే స్టోరీలు పిల్లల మనసుకు హత్తుకుంటాయి. రాత్రి పడుకునే సమయంలో పిల్లలకు ఈ కథలను చెప్పడం వల్ల వారితో అనుబంధం మరింత పెరుగుతుంది. పిల్లలు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే తల్లిదండ్రులతో చెప్పుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది.

మంచి నిద్రకు అవకాశం

రాత్రివేళల్లో పిల్లలు పడుకునే సమయంలో ఈ కథలను చెప్పడం వల్ల మంచి ఆరోగ్యకరమైన నిద్రను పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌ చూస్తూ, ఇతర ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్‌లతో అర్ధరాత్రి వరకూ ఉంటున్నారు. దీనివల్ల వారికి నిద్ర కరవవుతోంది. ఈ తరహా సమస్యలకు కథ మంచి పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. పిల్లలను పక్కలో వేసుకుని మీరు చెప్పే కథలు వారిని మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తాయని పేర్కొంటున్నారు.

ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌కు దూరంగా..

ఒకసారి పిల్లలను కథలకు అలవాటు చేస్తే ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌ అడిగేందుకు కూడా ఆసక్తి చూపించరు. పిల్లలకు చెప్పేందుకు అనుగుణమైన కథలను ప్రతిరోజూ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కథలు చెప్పడం రాకపోయినా యూట్యూబ్‌లో అనేక చానెల్స్‌ ప్రత్యేకంగా కథలను అందిస్తున్నాయి. కొన్ని బుక్స్‌ కూడా ఉన్నాయి. వీటిని విని లేదా చదివి పిల్లలకు చెప్పవచ్చు. ఒకవేళ చెప్పేంత తీరిక లేకపోతే పిల్లలను పక్కలో వేసుకుని ఆడియో స్పీకర్‌ ద్వారా వినిపించవచ్చు. అయితే, ఆ కథ వినే క్రమంలో పిల్లలకు వాటి గురించి విశ్లేషించి చెప్పడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యలకు పరిష్కారం

ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు చిన్న వయసు నుంచే హైపర్‌గా రియాక్ట్‌ కావడం, ఒత్తిడికి గురికావడం, చిరాకు, కోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు, గురువులు చెప్పే మాట కూడా వినేందుకు ఆసక్తి చూపించరు. వద్దని వారించినా వినిపించుకోని స్థితిలో ఉన్నారు. కొందరు చిన్నారులు తినేందుకు కూడా ఆసక్తి చూపించరు. ఈ తరహా సమస్యలకు కథలు వినడం పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఏడాది వయసు నుంచే పిల్లలకు కథలను చెప్పడం అలవాటు చేయాలి.

నైపుణ్యాలను మెరుగుపరచడంలో దోహదం

- డాక్టర్‌ ముత్యాల బాలాజీ, మానసిక నిపుణులు

కథలు అనేవి చిన్నారుల్లో అనేక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉపయోగపడతాయి. కథలు చదవడం వల్ల పిల్లలకు మేలు కలుగుతుంది. పిల్లల్లో ఆలోచనాత్మక, విశ్లేషణాత్మక శక్తి పెరగడంతోపాటు కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కొన్ని కథల్లో ఉండే నీతి వారి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయి. అలాగే, మాట్లాడే తీరులో మార్పు వస్తుంది. వినే శక్తి, మంచి, చెడులను గుర్తించే సామర్థ్యం కథలతో పెరుగుతుంది. కథలు పట్ల ఆసక్తి పెరిగే చిన్నారులు ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌కు దూరంగా ఉంటారు. ఇది అనేక అనర్థాల నుంచి చిన్నారులను రక్షిస్తుంది. కాబట్టి, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు ప్రతిరోజూ ఏదో ఒక కథను చెప్పాలి. ఇది వారి జీవితాన్ని మెరుగ్గా మలచేందుకు దోహదం చేస్తుంది.

Updated Date - May 25 , 2025 | 01:03 AM