హడలెత్తిస్తున్న తుఫాన్
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:17 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ తీవ్రరూపం దాలుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈదురు గాలులతో భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
అందుబాటులో 08924-222888, 08924-225999, 08924-226599 ఫోన్ నంబర్లు
తుఫాన్‌తో వరి రైతుల్లో ఆందోళన
అనకాపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్‌వర్క్):
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ తీవ్రరూపం దాలుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్ తుఫాన్ పరిస్థితులపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు, సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాగల మూడు రోజుల్లో కుంభవృష్టిగా వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సూచించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో వుండాలని చెప్పారు.
అల్లకల్లోలంగా సముద్రం
తుఫాన్ కారణంగా పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో సముద్రం అల్లకల్లోకంగా మారింది. సాధారణ రోజులతో పోలిస్తే అలలు ఒక మీటరు ఎత్తు వరకు అదనంగా ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు ఆదివారం సాయంత్రానికి పడవలు, తెప్పలను తీరంలో సురక్షిత ప్రదేశానికి చేర్చారు. సముద్ర తీరంలోని అన్ని పర్యాటక ప్రదేశాలను పోలీసులు మూసివేయడంతో సందర్శకులు ఎవరూ రాలేదు.
లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. రహదారులపై వర్షం నీరు ప్రవహించి వాగులను తలపించాయి. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. గోతుల్లో నీరు చేరి చెరవుల్లా దర్శనమిస్తున్నాయి. వర్షంతోపాటు రోడ్డు బాగోకపోవడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తున్నది.
జిల్లాలోని అన్ని జలాశయాల్లో నీటినిల్వలు ఇప్పటికే గరిష్ఠస్థాయికి చేరగా, తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు స్పిల్‌వే గేట్లు ఎత్తారు. రిజర్వాయర్లలోకి వచ్చే వరదకన్నా ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేసున్నారు. దీంతో నదులు, గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి పెరిగింది. చెరువులు పూర్తిగా నిండి పొర్లుకట్టల మీదుగా నీరు బయటకు పోతున్నది.
వరి రైతుల్లో ఆందోళన
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 54,465 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం పొట్ట, గింజపాలు పోసుకునే దశల్లో పంట వుంది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసి, ఈదురు గాలులు వీస్తే.. వరిపైరు నేలవాలి నీటమునుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్....
తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయక చర్యలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇంకా డివిజన్, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లో 08924-222888, 08924-225999, 08924-226599 ఫోన్ నంబర్లను అందుబాటులో వుంచి, 24 గంటలూ సిబ్బంది వుండేలాఏర్పాట్లు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనకాపల్లి: 9490610023, కశింకోట : 8333811271, 8333811272, నర్సీపట్నం: 9491030723 ఫోన్ నంబర్లను అందుబాటులో వుంచారు.
విస్తారంగా వర్షాలు
జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 19.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురవగా, మరికొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పరవాడ మండలంలో 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సబ్బవరంలో 38.8 మిల్లీమీటర్లు, అచ్యుతాపురంలో 32.6, మునగపాకలో 32.4, అనకాపల్లిలో 28.6, ఎలమంచిలిలో 28.6, కె.కోటపాడులో 27.8, రాంబిల్లిలో 24.6, కశింకోటలో 23.2, చోడవరంలో 16.8, రావికమతంలో 16.2, నక్కపల్లిలో 15.6, కోటవురట్లలో 15.4, చీడికాడలో 14.6, ఎస్.రాయవరంలో 14.4, పాయకరావుపేటలో 11.6, నర్సీపట్నంలో 11.2, మాకవరపాలెంలో 10.6 మాడుగులలో 10.4, రోలుగుంటలో 10.2, నాతవరంలో 7.2 గొలుగొండలో 5.6, దేవరాపల్లిలో 4.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం ఆరు గంటల తరువాత వర్ష తీవ్రత పెరిగింది.
74 పునరావాస కేంద్రాలు
అనకాపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 34 తుఫాన్ ప్రభావిత గ్రామాలను గుర్తించి 74 పునరావస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పాయకరావుపేటలో 11, నక్కపల్లిలో 10, రాంబిల్లిలో 5, ఎస్.రాయవరంలో 5, చోడవరంలో 4, రావికమతంలో 4, పరవాడలో 3, మునగపాకలో 3, నర్సీపట్నంలో 3, కోటవురట్లలో 3, సబ్బవరంలో 2, మాడుగులలో 2, చీడికాడలో 2, కశింకోటలో 2, దేవరాపల్లిలో 2, అచ్యుతాపురంలో 2, నాతవరంలో 2, కె.కోటపాడులో 2, బుచ్చెయ్యపేటలో 2, రోలుగుంటలో 1, గొలుగొండలో 1, మాకవరపాలెంలో 1, ఎలమంచిలిలో 1, అనకాపల్లి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో సిబ్బందిని నియమించి మంగళవారం నుంచి భోజనం, వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం సాయంత్రం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సాయంత్రం నుంచి వర్షం మరింత ఎక్కువైంది. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. పునరావస కేంద్రాలకు మూడు రోజులకు సరిపడ ఆహార దినుసులను తరలిస్తున్నట్టు చెప్పారు.
అనకాపల్లి డిపో నుంచి పలు బస్సులు రద్దు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్ కారణంగా అనకాపల్లి నుంచి నడిచే పలు బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు డిపో మేనేజర్ అనుమశ్రీ తెలిపారు. సోమ, మంగళవారాల్లో జోలాపుట్టు బస్సులను, తంతడి, కె.కొత్తపల్లి, దేవరాపల్లి, మాడుగుల, చోడవరం, రావికమతం, తట్టబంద నైట్ హాల్ట్ బస్సులను రద్దు చేశామన్నారు. విశాఖపట్నం, విజయనగరం బస్సులను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడుపుతున్నట్టు చెప్పారు.
నర్సీపట్నం డిపో నుంచి..
నర్సీపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్ ప్రభావంతో ముందు జాగ్రత్తగా ఏజెన్సీ సర్వీసులతో పాటు హైదరాబాద్, విజయవాడ, కాకినాడ సర్వీసులను రద్దు చేశామని నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో సీలేరు, దేవరాపల్లి, గుమ్మరేవుల, మొండిగెడ్డ, మారేడుమిల్లి బస్సులను రద్దు చేశారు. చింతపల్లికి ఆరు బస్సులకుగాను రెండు బస్సులను రద్దు చేశారు.