ఇక ఆపండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:54 AM
నగరంలో వినాయక చవితి ఉత్సవాల పేరుతో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు.
గాజువాకలో గణపతి ఉత్సవాల పేరిటభక్తులను దోచుకుంటున్న నిర్వాహకులకు చెక్
మూసివేతకు జీవీఎంసీ కమిషనర్ ఆదేశం
నిబంధనలను పదేపదే ఉల్లంఘించడంతోనే నిర్ణయం
రాత్రికి రాత్రి దర్శనాలు, వ్యాపారాలు నిలిపివేత
ఎట్టకేలకు స్పందించిన అధికారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వినాయక చవితి ఉత్సవాల పేరుతో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. గాజువాక లంకా మైదానంలో లక్ష చీరల గణపతి ఉత్సవాలను, పాత గాజువాకలో కోటి లింగాల గణపతి ఉత్సవాలను గురువారం రాత్రి నిలిపివేయించారు. ఈ రెండింటిపైనా ఆది నుంచి తీవ్రమైన ఆరోపణలు రావడమే కాకుండా అక్కడ పోలీసులు వద్దని చెప్పినా భక్తుల నుంచి దర్శనాలకు టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తూ వచ్చారు. పార్కింగ్ అని, అన్నదానం అని రకరకాలుగా దోచుకున్నారు. ఈ రెండుచోట్ల భక్తులతో వివాదాలు జరుగుతున్నాయి.
కోటి లింగాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడారని, అది కాలుష్య కారకమని, ఓ చిన్నారి లీగల్ నోటీసు కూడా ఇచ్చింది. ఆ బాలిక తండ్రి అడిగిన మొత్తం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారంటూ నిర్వాహకులు తిరగబడ్డారు. ఆర్టీసీ ఫ్రీ బస్సుల్లో మహిళలు పెద్దఎత్తున దర్శనాలకు వస్తున్నారని, టికెట్లు తీసుకోవడం లేదంటూ లంకా మైదానంలో గణపతి ఉత్సవ నిర్వాహకులు బుధవారం ఘర్షణపడ్డారు. గాజువాక పోలీసులు కూడా వారికే వత్తాసు పలికారు. నిర్వాహకులకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అధికారులు ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గాజువాక ఏసీపీ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. అయితే అవన్నీ అవాస్తవాలని తేలింది.
స్పందించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
గాజువాకలోని భారీ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న రెండు కమిటీలు కూడా సింగిల్ విండో కింద జీవీఎంసీ ఇచ్చిన అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలు పాటించలేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గుర్తించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ఉత్సవాలు నిర్వహించాలని వాటిలో పేర్కొన్నారు. అయితే వాటిని నిర్వాహకులు పదే పదే ఉల్లంఘించడం, పోలీసులు చెప్పినా వినకపోవడంతో ఆయన స్పందించారు. గురువారం సాయంత్రం రెండు ఉత్సవ కమిటీలకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. వాస్తవానికి ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనుమతులు ఉపసంహరించుకుంటున్నామని, వెంటనే అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. దాంతో లంకా మైదానం, పాత గాజువాకల్లో ఉత్సవాలకు ముగింపు పలికారు. బీచ్ రోడ్డులో ఏపీఐఐసీ మైదానంలో ఏర్పాటుచేసిన జర్మన్ సిల్వర్ వినాయక ఉత్సవాల వద్ద ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం, ఎటువంటి ఫీజులు వసూలు చేయకపోవడంతో అక్కడ అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిసింది.
వాటికి నిమజ్జనం కూడా లేదు
వినాయక ఉత్సవాల్లో పూజలు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఆది పూజా విధానంలో భాగం. ఇక్కడ దానిని కూడా వ్యాపారంగా మలుచుకున్నారు. లక్ష పట్టు చీరలతో గణపతిని తయారు చేశామని, ఆ చీరలను భక్తులకు ఉచితంగా పంచుతామని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఒక్కొక్క చీరకు రూ.500 రేటు పెట్టారు. చీరలు కావాలనుకునేవారికి ముందుగానే టికెట్లు విక్రయించారు. ఇప్పుడు దానిని మూసేయడంతో వాటిని ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. ఇక కోటి లింగాల గణపతి కోసం అనకాపల్లిలోని గవరపాలెంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో శివలింగం అచ్చులు తయారు చేయించారు. వాటిని గణపతి బొమ్మ ఆకారంలో పేర్చి నలుపు రంగు స్ర్పే చేశారు. నిమజ్జనం చేయకుండా ఆ లింగాలను భక్తులకు పంచిపెడతామని నిర్వాహకులు ప్రకటించారు. ఆ లింగాలు పూర్తి ఆకారంలో లేవు. అవి అచ్చు బొమ్మలు. సగమే ఉంటాయి. పూజకు పనికి రావు. వాటిని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకున్నా ఇబ్బందే. ఎక్కడ నిమజ్జనం చేసినా ఆ జలాలన్నీ కలుషితం అవుతాయి. అధికారులు ఏమి చేస్తారో చూడాలి.