రెస్టారెంట్లలో నిల్వ పదార్థాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:24 AM
నగరంలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించి, భారీగా జరిమానాలు వేస్తున్నా రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు.
అధికారుల తనిఖీల్లో బహిర్గతం
జరిమానాలు, శాంపిళ్ల సేకరణ
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించి, భారీగా జరిమానాలు వేస్తున్నా రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నారు. అవి తిన్నవారు ఆస్పత్రుల పాలవుతున్నారు. శుక్రవారం ఆహార భద్రతాధికారులు, జీవీఎంసీ పారిశుధ్య అధికారులు కలిసి నగరంలో పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి, జరిమానాలు విధించారు. రామ్‌నగర్‌లోని ట్రైన్ థీమ్ రెస్టారెంట్‌ను తనిఖీ చేసినపుడు వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. అందుకుగాను రూ.10 వేలు జరిమానా వేశారు. అలాగే అక్కడి ఫ్రీజర్లలో 26 కిలోల పాడైన ఆహార పదార్థాలను గుర్తించారు. పంచనామా చేసి వాటిని సీజ్ చేశారు. నాలుగు ప్యాకెట్లలో పాడైన పాలను గుర్తించి, వాటిని పారబోశారు. రెస్టారెంట్ భాగస్వామి ధనలక్ష్మిపై కేసు నమోదు చేసి నోటీసు ఇచ్చారు.
అదేవిధంగా ఎన్‌ఏడీ జంక్షన్‌లోని దీపక్ పంజాబీ దాబాలో 46 కిలోల ఆహార పదార్థాలు పాడైపోయినవి నిల్వ చేసినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రూ.10,605 జరిమానా వేశారు. ఎన్‌ఏడీ జంక్షన్‌లోని ప్యారడైజ్ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించగా నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఏమీ దొరకలేదు. వంట గది పరిసరాలు కూడా పరిశుభ్రంగానే ఉండడంతో ఎటువంటి కేసులు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు.
పలువురు సీఐల బదిలీ
మహారాణిపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వన్‌టౌన్ సీఐ జి.దేముడుబాబును ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ అధికారిగా బదిలీ చేసి, ఆయన స్థానంలో పూడి వరప్రసాద్‌ను నియమించారు. సిటీ వీఆర్‌లో ఉన్న ఎస్.రామకృష్ణను ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారిగా నియమించి, అక్కడున్న జి.అర్జున్‌ను సీ పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారిగా పంపారు. సీ పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారిగా ఉన్న వి.శ్రీనివాసరావును సిటీ వీఆర్‌కు అటాచ్ చేశారు. ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ అధికారిగా ఉన్న మలిరెడ్డి నాగేశ్వరరావును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఎయిర్‌పోర్టు సీఐగా ఉన్న జి.ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్‌కు అటాచ్ చేశారు. సీసీఎస్ సీఐగా ఉన్న వి.శంకర్‌నారాయణను ఎయిర్‌పోర్టు లా అండ్ ఆర్డర్ సీఐగా బదిలీ చేశారు. కొత్త బాధ్యతలు వెంటనే చేపట్టాలని కమిషనర్ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
రైస్ స్మార్ట్ కార్డులు 88.71% పంపిణీ
మొత్తం కార్డులు 5,17,155, ఇప్పటివరకూ పంపిణీ అయినవి 4,58,759
అత్యధికంగా పద్మనాభం మండలంలో 97.32 శాతం
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జిల్లాలో 88.71 శాతం మేర జరిగింది. రెండు నెలల నుంచి సచివాలయాలు, రేషన్ డిపోల్లో స్మార్ట్ రైస్ కార్డులు అందుబాటులో ఉంచారు. కార్డుదారులు తమ తమ ప్రాంతాల్లో సచివాలయాలు, రేషన్‌డిపోలకు వెళ్లి కార్డులు తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినవారు, నగరంలో కొందరు మాత్రం ఇంకా కార్డులు తీసుకోలేదు. జిల్లాలోని 642 రేషన్ డిపోల్లో 5,17,155 మంది కార్డుదారులు ఉన్నారు. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో 2,08,322, రేషన్ డిపోల్లో 2,50,437 మంది...మొత్తం 4,58,759 (88.71 శాతం) మంది కార్డులు తీసుకున్నారు. ఇంకా 58,396 మంది తీసుకోవలసి ఉంది. పద్మనాభం మండలంలో 16,569 మందికిగాను 16,125 (97.32 శాతం), పెందుర్తి మండలంలో 10,455 మందికిగాను 9,873 (94.43 శాతం), ఆనందపురం మండలంలో 20,254 మందికి 19,005 (93.83), భీమునిపట్నం మండలంలో 34,521 మందికి 31,250 (90.52 శాతం) మంది కార్డులు తీసుకున్నారు. ఇక నగర పరిధిలో సర్కిల్-1లో 1,54,074కి 1,34,267 (87.14 శాతం), సర్కిల్-2లో 1,50,377కి 129,594 (86.18 శాతం), సర్కిల్-3లో 1,30,905కి 1,18,645 (90.63 శాతం) మందికి పంపిణీ చేశారు. ఈ నెలాఖరు వరకు రేషన్ డిపోల్లో స్మార్ట్ రైస్‌కార్డులు అందుబాటులో ఉంటాయని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి వి.భాస్కర్ తెలిపారు. ఆ తరువాత సహాయ పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో ఉంచుతామని, కార్డుదారులు అక్కడకు వెళ్లి తీసుకోవచ్చునని అన్నారు.