ఇంకా పాత ధరలే!
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:11 AM
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించినా వాటి ఫలాలు సామాన్యులకు పూర్తిగా అందడం లేదు.
వినియోగదారులకు అందని జీఎస్టీ 2.0 ఫలాలు
వ్యాపారుల మాయాజాలం
అధికారుల పర్యవేక్షణ నిల్
ప్రభుత్వ ప్రచారం వల్ల ప్రయోజనం శూన్యం
షాపుల్లో ధరల పట్టికలు పెట్టినప్పుడే ఉపయోగం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించినా వాటి ఫలాలు సామాన్యులకు పూర్తిగా అందడం లేదు. ఇంకా పాత రేట్లకే వ్యాపారులు వస్తువులు విక్రయిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన యంత్రాంగం కార్యాలయాలకే పరిమితం కావడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు.
సెప్టెంబరు 22 నుంచే జీఎస్‌టీ తగ్గింపు అమలులోకి వచ్చింది. కానీ చాలామంది వర్తకులు ఇంకా పాత ధరలకే వస్తువులను విక్రయిస్తున్నారు. దీనిపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన లేదు. చిత్తశుద్ధితో ప్రజలకు ప్రయోజనం అందించాలంటే తప్పనిసరిగా ప్రతి దుకాణంలో పాత రేట్లు, కొత్త రేట్లతో బోర్డులు ఏర్పాటుచేయాలి. అప్పుడే ధర ఎంత తగ్గిందనేది కొనుగోలుదారులకు తెలుస్తుంది. ఉదాహరణకు ఒక కిరాణా షాపునకు వెళ్లి టీపొడి కొనుగోలు చేస్తే ఒక బ్రాండ్ ఉత్పత్తిని ఎంఆర్‌పీ కంటే తక్కువకు ఇస్తున్నారు. జీఎస్‌టీ తగ్గిందని చెబుతున్నారు. అదేషాపులో మరో బ్రాండ్ టీ పౌడర్ కొంటే ఎంఆర్‌పీనే తీసుకుంటున్నారు. రేటు తగ్గించడం లేదు. జీఎస్‌టీ తగ్గలేదని చెబుతున్నారు. ఒకే రకమైన ఉత్పత్తిని వేర్వేరు సంస్థలు వేర్వేరు జీఎస్‌టీ ధరలతో విక్రయిస్తున్నాయి. అధికారులు ఇలాంటి అంశాల జోలికి పోవడం లేదు. కేవలం సమావేశాలు నిర్వహించి, తగ్గిన జీఎస్‌టీ ధరలు అమలు చేయాలని సూచిస్తున్నారు.
నగర ప్రజలు ఎవరైనా సరే భారీ మొత్తం పెట్టి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు బిల్లు పరిశీలించి, వస్తువు ధర, జీఎస్‌టీ ఎంత పడిందో చూసుకుంటారు. అది కూడా బిల్లు చేతికి ఇచ్చినప్పుడు మాత్రమే. కొన్ని షాపుల్లో మొబైల్ ఫోన్‌కు బిల్లు పంపించామని, చూసుకోవాలని చెబుతున్నారు. వెస్ట్ సైడ్, మ్యాక్స్ తదితర షాపులలో ఇలాగే మొబైల్ బిల్స్ ఇస్తున్నారు. అలాంటివి చూసేంత తీరిక, ఓపిక కొనుగోలుదారులకు ఉండడం లేదు. వందల రూపాయల విలువైన వస్తువులు కొన్నప్పుడు ఎంఆర్‌పీలు చూసుకుంటున్నారే తప్ప వాటిపై జీఎస్‌టీ ఎంత అనేది ఎవరూ గమనించడం లేదు. ఇదే వ్యాపారులు మోసం చేయడానికి అవకాశం కల్పిస్తోంది.
ఒక్కో దగ్గర ఒక్కోలా...
మెడిసిన్స్ ధరలు కూడా బాగా తగ్గాలి. అయితే కొందరే అమలు చేస్తున్నారు. మరికొందరు పట్టించుకోవడం లేదు. జీఎస్‌టీ తగ్గిందని బోర్డులు ప్రదర్శించాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆదేశించారు. ఇది ఎలా అమలు అవుతున్నదో తెలుసుకోవడానికి అక్కయ్యపాలెం ప్రాంతంలో పరిశీలించగా, హోల్‌సేల్ అండ్ రిటైల్‌గా మందులు విక్రయించే గుప్తా మెడికల్స్‌లో దీనిపై ప్రత్యేకంగా బోర్డు పెట్టారు. దానికి సమీపంలోనే ఉన్న మెడిప్లస్ మందుల దుకాణంలో మాత్రం జీఎస్‌టీకి సంబంధించిన బోర్డు లేదు. వారి దగ్గర జనరిక్ మందులు కొంటే 50 శాతం నుంచి 80 శాతం తక్కువకు వస్తాయని, సిబ్బంది కావాలనే బోర్డులు మాత్రం ప్రదర్శించారు. ఇలా బోర్డులు ప్రదర్శించని దుకాణాలు చాలా ఉన్నాయి.
అదేవిధంగా రెగ్యులర్‌గా ఇళ్లల్లో వాడే సబ్బులు, టూత్‌పేస్టులు, పౌడర్లు, నూనెలు, వాషింగ్ లిక్విడ్, పప్పు దినుసులపై ఏ మేరకు రేట్లు తగ్గాయనేది ఆయా షాపుల్లో బోర్డులు పెట్టించాలి. ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం నిర్వహించడం అంటే అది. కొందరు అధికారులు ‘క్యూఆర్ కోడ్’ ఇచ్చి దానిని స్కాన్ చేస్తే జీఎస్‌టీ ఎంత తగ్గుతుందో తెలుస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఆ కోడ్ స్కాన్ చేస్తే జీఎస్‌టీ క్యాలక్యులేటర్ వస్తోంది. దాంతో ఏమి చేయాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రతిచోట బోర్డులు పెట్టినప్పుడే తేడా తెలుస్తుంది.