Share News

రైల్వే జోన్‌కు ఇంకా రెడ్‌ సిగ్నలే...

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:53 AM

‘తాంబూలాలు ఇచ్చాం...తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉంది విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిస్థితి.

రైల్వే జోన్‌కు ఇంకా రెడ్‌ సిగ్నలే...

గెజిట్‌ విడుదలలో తాత్సారం

ఖాళీగా కొత్త జీఎం

'తూర్పు కోస్తా' పెత్తనంలోనే వాల్తేరు డివిజన్‌

మరోవైపు ‘డెక్‌’లో దక్షిణ కోస్తా కార్యాలయం పనులు పూర్తి

ముడసర్లోవలో జోనల్‌ కార్యాలయ భవన నిర్మాణం ప్రారంభం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘తాంబూలాలు ఇచ్చాం...తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉంది విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిస్థితి. జోన్‌కు అతి ముఖ్యమైన గెజిట్‌ను విడుదల చేయకపోవడం వల్ల ఏ అధికారీ ఏ పని చేయలేకపోతున్నారు. ఆ గెజిట్‌ విడుదలైతేనే ‘జోన్‌ ఆపరేషన్‌’ ప్రారంభమవుతుంది. అది ఇవ్వకపోవడం వల్ల విశాఖపట్నం ఇప్పటికీ తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోనే ఉంది. విశాఖపట్నం డివిజనల్‌ మేనేజర్‌ ఆ జోన్‌ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుడుకుంటున్నారు.

దక్షిణ కోస్తా జోన్‌కు జనరల్‌ మేనేజర్‌గా సందీప్‌ మాఽదుర్‌ను జూన్‌ మొదటి వారంలో నియమించారు. ఆయన వచ్చి ఐదు నెలలైంది. ప్రత్యేకమైన రైలులో జోన్‌ మొత్తం తిరుగుతూ వివిధ పనులు పర్యవేక్షించాల్సిన ఆయన డీఆర్‌ఎం కార్యాలయంలోని చిన్న గదిలో కూర్చుంటున్నారు. జోన్‌ కార్యాలయం కోసం ముడసర్లోవలో రూ.172 కోట్లతో పనులు ప్రారంభించారు. అక్కడ చకచకా పనులు జరుగుతున్నాయి. దీనిని పూర్తి చేయడానికి 28 నెలల గడువు ఇచ్చారు. అంతవరకు కొత్త జోన్‌ అధికారులు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన ‘డెక్‌’లో ఆరు, ఏడు అంతస్థులను అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఫర్నీచర్‌ వర్కులన్నీ పూర్తయిపోయాయి. సుమారు అర డజను మంది అధికారుల నియామకం కూడా జరిగింది. ఓఎస్‌డీ, సీఏఓ తదితరులు జోనల్‌ కార్యాలయం పనులు పర్యవేక్షిస్తున్నారు. మిగిలినవారు పని చేయాలంటే...తూర్పు కోస్తా జోన్‌ నుంచి దక్షిణ కోస్తాను విడదీయాలి. దీనికి గెజిట్‌ నోటిఫికేషన్‌ అవసరం. అది రానంత వరకూ తూర్పు కోస్తా పెత్తనమే ఉంటుంది. ప్రస్తుతం అదే నడుస్తోంది. కొత్త జీఎం సందీప్‌ మాధుర్‌ మాట ఎవరూ వినడానికి లేదు. ఆదేశాలు పాటించాల్సిన బాధ్యతా లేదు.

ఆగస్టు 15, దసరా అయిపోయాయి

దక్షిణ కోస్తా జోన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మాట్లాడారు. గెజిట్‌ విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 15న వస్తుందని భావించారు. రాలేదు. ఆ తరువాత విజయదశమికి ఇస్తారని అనుకున్నారు. అదీ దాటిపోయింది. నవంబరులో వచ్చే అవకాశం ఉందన్నారు. అదీ లేదు. ఇప్పుడు జనవరి 2026 అంటున్నారు.

ఎంత ఎంపీలను కలిసినా ...

చలసాని గాంధీ, రైల్వే యూనియన్‌ నాయకులు

దక్షిణ కోస్తా జోన్‌కు గెజిట్‌ విడుదల కోసం ఢిల్లీలో డిమాండ్‌ చేయాలని ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలందరినీ కలిశాము. అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ సీఎం రమేశ్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అరకు ఎంపీ తనూజరాణి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశాము. ఫలితం లేదు. తూర్పు కోస్తా రైల్వే అధికారులకు విశాఖను వదులుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ తాత్సారం. గెజిట్‌ రాకుండా జోన్‌ ఆపరేషన్‌ అసాధ్యం. దీనికి సీఎం చంద్రబాబునాయుడే చొరవ తీసుకోవాలి. ఈసారి ఢిల్లీ వెళ్లినప్పుడు దీనిపై గట్టిగా అడగాలి. అప్పుడే సాధ్యమవుతుంది.

Updated Date - Nov 22 , 2025 | 12:53 AM