సంకల్పానికి కట్టుబడి
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:49 PM
సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని పిరిబంద గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు ఒక ఇంటి వరండాలో విద్యాభ్యాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వర్షమొస్తే తరగతులు జరగని పరిస్థితి. దీంతో గ్రామస్థులు చందాలు వేసుకుని తాత్కాలికంగా షెడ్డు నిర్మించారు.
పిరిబంద గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థుల ఇబ్బందులు
ఇంటి వరండాలో తరగతులు
ఎండ, వానలకు అవస్థలు
ఆరేళ్ల క్రితం పాఠశాల భవనం కూలిపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం
ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం
చందాలు వేసుకుని తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మించిన గ్రామస్థులు
ప్రస్తుతం గోడల నిర్మాణం
త్వరలోనే బాలలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం
అరకులోయ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని పిరిబంద గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు ఒక ఇంటి వరండాలో విద్యాభ్యాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వర్షమొస్తే తరగతులు జరగని పరిస్థితి. దీంతో గ్రామస్థులు చందాలు వేసుకుని తాత్కాలికంగా షెడ్డు నిర్మించారు. ప్రస్తుతం గోడలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే అందులో తరగతులు నిర్వహిస్తారు.
పిరిబంద గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ఆరేళ్ల క్రితం కూలిపోయింది. దీంతో పాఠశాల భవనం నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను గ్రామస్థులు పలుమార్లు వేడుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఈ గ్రామానికి వచ్చి కూలిపోయిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆ విషయమే మరిచిపోయారు.
ఇంటి వరండాలోనే చదువులు
ప్రస్తుతం ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల భవనం లేకపోవడంతో ఒక ఇంటి వరండాలో వీరికి ఏకోపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. ఎండ కాసినా, వర్షమొచ్చినా తరగతులకు అంతరాయం ఏర్పడుతోంది. ఐటీడీఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ఇటీవల గ్రామస్థులు ఇంటికి రూ.500 చొప్పున చందాలు వేసుకుని అరకులోయ వెళ్లి సిమెంట్ రేకులు కొనుగోలు చేశారు. గ్రామానికి చెందిన కొర్ర డొంబు తన స్థలం ఇవ్వడానికి ముందుకు రావడంతో అందులో పాఠశాల షెడ్డు నిర్మించారు. చుట్టూ రాళ్లు, మట్టితో గోడలు నిర్మిస్తున్నారు. త్వరలోనే దీనిని పూర్తి చేసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని భావిస్తున్నామని గ్రామస్థులు పాంగి రాజు, పాంగి జాని, కొర్ర రంగా, పాంగి దేవరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీటీజీ తెగలకు పీఎం జన్‌మన్ పథకం కింద వసతులు కల్పిస్తున్నాయని, దీనిలో భాగంగా పాఠశాల భవనాన్ని నిర్మించాలని వారు కోరుతున్నారు.