Share News

మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి చర్యలు

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:06 AM

ఎట్టకేలకు స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కాంట్రాక్ట్‌ పద్ధతిలో 104 పోస్టుల భర్తీపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అభ్యర్థుల ప్రాథమిక అర్హత జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు తమ అర్హతను పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 నుంచి 20వ తేదీలోగా స్వయంగా లేదా మెయిల్‌ ద్వారా తమకు ఫిర్యాదు చేయవచ్చునని మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలతదేవి తెలిపారు.

మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి చర్యలు
పాడేరులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

- మొత్తం 244 పోస్టులకు 15,512 దరఖాస్తులు

- ప్రస్తుతం 104 కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి చర్యలు

- అవుట్‌సోర్స్‌ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేనట్టే

- దరఖాస్తు చేసిన అభ్యర్థుల తొలి మెరిట్‌ జాబితా విడుదల

- నేటి నుంచి 20వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ: ప్రిన్సిపాల్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఎట్టకేలకు స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కాంట్రాక్ట్‌ పద్ధతిలో 104 పోస్టుల భర్తీపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అభ్యర్థుల ప్రాథమిక అర్హత జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు తమ అర్హతను పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 నుంచి 20వ తేదీలోగా స్వయంగా లేదా మెయిల్‌ ద్వారా తమకు ఫిర్యాదు చేయవచ్చునని మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలతదేవి తెలిపారు.

స్థానిక మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి అభ్యర్థులు గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న వైనంపై గత జూన్‌ నెల ఏడో తేదీన ‘ఎన్నాళ్లీ నిరీక్షణ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. దీంతో మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలను వేగవంతం చేశారు. స్థానిక మెడికల్‌ కాలేజీలో వివిధ విభాగాల్లోని 244 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే మెడికల్‌ కాలేజీలోని పోస్టుల భర్తీలో గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీంతో ఆయా(అవుట్‌ సోర్స్‌ మాత్రమే) పోస్టుల భర్తీకి సంబంధించి ఎలా చర్యలు చేపట్టాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని జిల్లా అధికారులు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ను అనుమతి కోరుతూ లేఖలు రాశారు. అయితే అక్కడి నుంచి ఎటువంటి సమాధానం ఇంకా రాలేదు. కానీ ఆయా పోస్టుల భర్తీ ఆలస్యంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది కొరతను అధిగమించలేకపోతున్నామని గుర్తించిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు మినహాయించి, కాంట్రాక్ట్‌ పద్ధ్దతిలో ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఒక్కో పోస్టుకు సగటున 63 మంది దరఖాస్తు

స్థానిక మెడికల్‌ కాలేజీలో పోస్టుల కోసం ఊహించిన దానికంటే అధికంగానే దరఖాస్తులు వచ్చాయి. మొత్తం పోస్టుల్లో కాంట్రాక్ట్‌ విధానంలో 107, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 137 పోస్టులకు 15,512 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సగటున 63 మంది దరఖాస్తు చేశారు. ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు దరఖాస్తులు చేయడంతో విపరీతమైన పోటీ నెలకొంది.

అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి మరింత సమయం

స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉన్న పోస్టుల భర్తీకి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉన్న పోస్టులన్నింటికి ఒకే నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలతో కూడిన అనుమతి రాకపోవడంతో జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతానికి అవసరమైన సాంకేతికపరమైన కాంట్రాక్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రభుత్వ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపడితే అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టకపోవడంతో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమవుతున్నది.

Updated Date - Jul 16 , 2025 | 01:06 AM