జిల్లాలో విద్యాభివృద్ధికి చర్యలు భేష్
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:22 PM
జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధికి చేపడుతున్న చర్యలు అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
కలెక్టర్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఇదే నమూనా అమలును పరిశీలించాలని సూచన
పాడేరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధికి చేపడుతున్న చర్యలు అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. అమరావతిలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఉత్తమ ఫలితాలు సాధించిన అంశాలను వివరించేందుకు ఐదుగురు కలెక్టర్లను ఎంపిక చేయగా, అందులో తొలుత జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌కు అవకాశం దక్కింది. జిల్లాలో ‘నిర్మాణ్’ పేరిట అమలు చేస్తున్న విద్యా పథకాలను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఈ సందర్భంగా వివరించారు.
‘సూపర్ 50’తో టెన్త్‌లో చక్కని ఫలితాలు
జిల్లాలో పదవ తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో ‘సూపర్ 50’ ఇన్స్పిరేషన్ ఇంజన్ ఆఫ్ నిర్మాణ్ పేరిట పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, 50 మందిని ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేశామన్నారు. ఎంపికైన వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తున్నామని, గత రెండేళ్లలో చక్కని ఫలితాలు సాధించామని కలెక్టర్ వివరించారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెరగడంతోపాటు టెన్త్‌లో చక్కని మార్కులతో ఉత్తీర్ణులు కావడంతో ఉన్నత చదువుల్లో సీట్లు దక్కడం, గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులపై ఆసక్తి పెంచడం జరుగుతున్నదన్నారు.
‘టీఆర్‌ఎల్’ అమలుతో 90 వేల మంది విద్యార్థులకు లబ్ధి
జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధిని మరింత పటిష్ఠం చేసేందుకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్(టీఆర్‌ఎల్)ను అమలు చేశామని, ఫలితంగా 90 వేల మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా టీఆర్‌ఎల్ అమలు చేయగా, అల్లూరి జిల్లాలో 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. దీంతో ప్రత్యేక్షంగా 90 వేల మంది గిరిజన విద్యార్థులకు మేలు జరిగిందని, దీనికి రూ.60 లక్షల వరకు వ్యయం చేశామని కలెక్టర్ తెలిపారు. అలాగే నిర్మాణ్‌లో భాగంగా విద్యార్థుల పఠనాసక్తిని పరీక్షించి వారిని ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజించి, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి వారు ముందు గ్రేడుల్లోకి వచ్చేలా తయారు చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని తెలిపారు.
కలెక్టర్‌ను అభినందించిన సీఎం
గిరిజన విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై సంతృప్తి చెందిన సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్‌ను అభినందించారు. విద్యాభివృద్ధికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అమలు చేస్తున్న విద్యా(నిర్మాణ్) కార్యక్రమాలను పరిశీలించి, వాటినే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను కలెక్టర్లందరూ పరిశీలించాలన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ, సైతిక విలువలు, క్రీడలు అందించేందుకు కుప్పంలో ప్రారంభించిన ‘విలువల బడి’ తరహా కార్యక్రమాలను విధిగా అమలు చేయాలన్నారు. విద్యార్థులు రాష్ట్రానికే కాదు ప్రపంచానికి సైతం ఆస్తులని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.