Share News

జిల్లాలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:56 PM

జిల్లాలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. అమరావతిలో మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల నాలుగో విడత రెండో రోజు సదస్సులో ఆయన మాట్లాడారు.

జిల్లాలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్ల సదస్సులో ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

గ్రామాభివృద్ధి ప్రణాళికలతో పల్లెలకు ప్రయోజనమని వెల్లడి

పాడేరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. అమరావతిలో మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల నాలుగో విడత రెండో రోజు సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధికి తాత్కాలిక పనులు కాకుండా నిర్మాణాత్మక పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు. అలాగే మైదాన ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్టుగానే పల్లెల అభివృద్ధికి ‘గ్రామాభివృద్ధి ప్రణాళిక’ రూపకల్పన ద్వారా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం సమస్యగా మారిందన్నారు. సీసీ రోడ్లు పంచాయతీరాజ్‌ శాఖ నిర్మిస్తుండగా, డ్రైనేజీలను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నిర్మిస్తోందని, ఈ క్రమంలో సమన్వయం లేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. దీనిపై సీఎం చంద్రబాబునాయుడు స్పందిస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి ఒకే తరహాలో మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు.

అర్బన్‌ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుకు వినతి

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో పెసా చట్టం రూరల్‌ ప్రాంతాల్లో అమలు సర్వసాధారణమని, కానీ అర్బన్‌ ప్రాంతాల్లో దానిని అమలు చేయడానికి అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబునాయుడును కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ కోరారు. జిల్లాలో పాడేరు, అరకులోయ అర్బన్‌ ప్రాంతాలుగా ఉన్నాయని, అక్కడ పెసా అమలు జరగాలన్నారు. అలాగే జిల్లాలో గ్రేడ్‌- 1గా 8 పంచాయతీలు, గ్రేడ్‌- 2గా 20 నుంచి 30 పంచాయతీలున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లోనూ పెసా అమలుకు ప్రత్యేక ఆదేశాలు కావాలన్నారు. కలెక్టర్‌ అభ్యర్థనపై సీఎం చంద్రబాబునాయుడు స్పందిస్తూ గిరిజన ప్రాంతాల్లో పన్నులు పెంచకుండా, చట్టాలను అమలు చేస్తూ రూర్బన్‌ విధానంలో మోడల్‌ పంచాయతీలను అభివృద్ధి చేయాలన్నారు. అందుకు గాను అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Sep 16 , 2025 | 11:56 PM