Share News

కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - May 21 , 2025 | 11:44 PM

కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చురుగ్గా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ ఆదేశించారు. పాడేరులో బుధవారం నిర్వహించిన జిల్లా క్రైమ్‌ సమీక్షలో ఆయన మాట్లాడారు.

కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
పోలీసు అధికారులతో సమీక్షిస్తున్న ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

ఎస్పీ అమిత్‌బర్ధార్‌ ఆదేశం

మావోయిస్టుల కదలికపై అప్రమత్తంగా ఉండాలని సూచన

పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చురుగ్గా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ ఆదేశించారు. పాడేరులో బుధవారం నిర్వహించిన జిల్లా క్రైమ్‌ సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యలపై పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు వారికి భరోసా ఇచ్చేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టాలని, పలు కేసులకు సంబంధించి చార్జిషీట్ల దాఖలుపై దృష్టి సారించాలన్నారు. గంజాయి సాగు నిర్మూలనకు డ్రోన్లను వినియోగించాలని, ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలన్నారు. సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రధాన కూడళ్లలో, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని, వాటిపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. జిల్లాకు సరిహద్దున వున్న రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ వాహనాల తనిఖీలతో పాటు స్టేషన్‌ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, కల్వర్టులు, వంతెనల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేయాలన్నారు. మావోయిస్టులకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభించినా ఉన్నతాధికారులకు అందించాలని, ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆదేశించారు. లొంగిపోయిన మావోయిస్టులకు చక్కని పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ కె.ధీరజ్‌, చింతపల్లి, చింతూరు ఏఎస్పీలు నవజ్యోతిమిశ్రా, పంకజ్‌కుమార్‌ మీనా, రంపచోడవరం, పాడేరు డీఎస్పీలు షెహబాజ్‌ అహ్మద్‌, సాయిప్రశాంత్‌, పలువురు సీఐలు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:44 PM