Share News

ఉక్కు యాజమాన్యం దాగుడుమూతలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:00 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుపై యాజమాన్యం దాగుడుమూతలాడుతోంది.

ఉక్కు యాజమాన్యం దాగుడుమూతలు

  • ఒకపక్క లాభాల్లోకి తేవడానికి యత్నిస్తున్నామంటూనే మరోపక్క ఒక్కో విభాగం ప్రైవేటీకరణ

  • ఎస్‌ఎంఎస్‌-2లో క్రేన్ల నిర్వహణకు తాజాగా టెండర్‌ల ఆహ్వానం

  • కన్వేయర్ల నిర్వహణ, ఎలక్ర్టికల్‌, మెకానికల్‌ పనులు కూడా...

  • ప్రమాదాలు జరిగేది అక్కడే...అదే అప్పగింతకు యత్నం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుపై యాజమాన్యం దాగుడుమూతలాడుతోంది. ప్లాంటును లాభాల బాటలోకి తేవడానికి యత్నిస్తున్నామని, కేంద్రం నిధులు ఇచ్చిందని ఒకవైపు చెబుతూ, మరోవైపు ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తోంది. వారి మాటలు, చేతలకు పొంతన ఉండడం లేదు. వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తూ 100 శాతం ఉత్పత్తి పేరుతో అదనంగా రోజుకు నాలుగు గంటలు పనిచేయిస్తున్నారు. లాభాలు వస్తున్నా ఇంకా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. మూడు నెలల బకాయి ఉంది. తాము అనుకున్నదే చేస్తామనే రీతిలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఎస్‌ఎంఎస్‌-2 ప్లాంటులో సుమారుగా 12 క్రేన్ల నిర్వహణ, కన్వేయర్‌ బెల్ట్‌ల హౌస్‌ కీపింగ్‌ పనులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్‌ పిలిచారు. రెండేళ్ల నిర్వహణకు అంచనాగా రూ.14.55 కోట్ల వ్యయం అవుతుందని, అర్హతలు కలిగిన సంస్థలు టెండర్లు దాఖలు చేయాలని యాజమాన్యం పిలుపునిచ్చింది.

బ్లాస్ట్‌ ఫర్నేస్‌లలో తయారైన హాట్‌ మెటల్‌ (ద్రవ రూపంలోని స్టీల్‌)ను ల్యాడిల్స్‌ (గుండ్రటి భారీ బిందెల ఆకారంలో ఉంటాయి) ద్వారా క్రేన్ల సాయంతో స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌) విభాగానికి తీసుకువస్తారు. ల్యాడిల్స్‌ అన్నీ క్రేన్లతోనే ఆపరేట్‌ చేస్తారు. ఈ ప్రక్రియలోనే తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కో ల్యాడిల్‌లో 150 టన్నుల ఉక్కు ద్రవం ఉంటుంది. క్రేన్‌ ఏ మాత్రం బ్యాలెన్స్‌ తప్పినా ల్యాడిల్‌ వంగి అందులో ద్రవం నేలపాలవుతుంది. అది ఏ కార్మికుడిపై పడినా నామరూపాలు ఉండవు. అదేవిధంగా నష్టం కూడా లక్షల రూపాయల్లో ఉంటుంది. మూడు దశాబ్దాలుగా అదే పనిచేస్తున్న సిబ్బంది నిర్వహణలోనే తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఎవరో కొత్తవారు వచ్చి వాటిని ఆపరేట్‌ చేస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందా?, పెరుగుతుందా?...అనేది యాజమాన్యం వెల్లడించాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. క్రేన్ల ఆపరేషన్‌ ఒక్కటే కాకుండా వాటికి సంబంధించిన కన్వేయర్ల నిర్వహణ, ఎలక్ర్టికల్‌, మెకానికల్‌ పనులన్నీ ఏజెన్సీయే చేయాలని నిబంధన పెట్టారు. ఇది క్లిష్టమైన ప్రక్రియ. దీనిని చిత్తశుద్ధితో పనిచేసే వారే నిర్వహించగలరు. కాంట్రాక్టుపై బయటవారు చేస్తే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

ఒక్కో విభాగం ఒక్కొక్కరికి...

ఏదైనా బస్సును నడుపుతున్నప్పుడు స్టీరింగ్‌ ఒకరు పట్టుకొని, గేర్లు ఒకరు మారుస్తూ, బ్రేకులు ఇంకొకరు వేస్తుంటే... ఆ బస్సు ఎలా నడుస్తుందో...ఇప్పుడు స్టీల్‌ ప్లాంటు పరిస్థితి కూడా అలాగే ఉందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్కో విభాగాన్ని ఒక్కొక్కరికి అప్పగిస్తూ సమన్వయం లేకుండా చేస్తున్నారని, ఇది పూర్తిగా స్టీల్‌ ప్లాంటును నిర్వీర్యం చేస్తుందని ఉద్యోగులు, కార్మికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 01:00 AM