ఉక్కు మంత్రి కుమారస్వామి రాక రేపు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:44 AM
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి గురువారం విశాఖపట్నం వస్తున్నారు.
ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామికవేత్తలతో భేటీ
స్టీల్‌ప్లాంటు సందర్శనపై స్పష్టత కరవు
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి గురువారం విశాఖపట్నం వస్తున్నారు. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామికవేత్తలతో స్టీల్ ప్లాంటు ఇన్‌చార్జి సీఎండీ ఏకే సక్సేనా నోవాటెల్ హోటల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో కేంద్ర మంత్రి పాల్గొంటారు. సక్సేనా మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్) ఎండీగా పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ఎంఓఐఎల్ మాంగనీస్ సరఫరా చేస్తుంది. దానికి సంబంఽధించి నోవాటెల్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంటులో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి ప్లాంటుకు వస్తారా?, రారా?...అనేది తెలియడం లేదు. దీనిపై అధికార వర్గాలు ఏమీ సమాచారం ఇవ్వడం లేదు.
మరో 450 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు
ఉక్కు వర్గాల్లో తీవ్ర ఆందోళన
ఉక్కుటౌన్‌షిప్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియను యాజమాన్యం కొనసాగిస్తోంది. తాజాగా మంగళవారం సుమారు 450 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించినట్టు సమాచారం. ఆరు నెలలుగా స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం దశల వారీగా తొలగిస్తోంది. తొలివిడత 1,503 మందిని తొలగించింది. రెండో విడతగా మరో 1,542 మంది కార్మికులను నిలిపివేసింది. ఇలా ఏకంగా మూడు వేలకు పైగా కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు ఉపాధికి దూరమై రోడ్డున పడడంతో భారీఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇది కార్మిక విజయంగా భావించారు. అయితే కొద్దికాలంగా తిరిగి రోజుకు పది మంది చొప్పున తొలగిస్తూ వస్తున్నది. దీనిపై కార్మికులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదు. విధులకు హాజరయ్యేందుకు వెళితే లేబర్ గేటు వద్ద బయోమెట్రిక్ నమోదుకావడం లేదు. దీంతో తొలగించినట్టు లెక్క. మొత్తంగా కాంట్రాక్టు కార్మికుల సేవలను దూరం చేసే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఈ దఫా మరో 450 మందిపై వేటు వేసింది. సమాచారం లేకుండానే కార్మికులను నిలిపివేస్తుండడంతో ప్రతిరోజూ భయంభయంగా విధులకు హాజరవుతున్నామని వారంతా వాపోతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం తొలగించిన కార్మికుల్లో నిర్వాసిత కార్మికులు ఎవరూ లేరని సమాచారం.