Share News

సమ్మెపై చర్చలకు ఉక్కు యాజమాన్యం డుమ్మా

ABN , Publish Date - May 31 , 2025 | 01:09 AM

కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ (ఆర్‌ఎల్‌సీ)తో శుక్రవారం నగరంలో జరగాల్సిన చర్చలకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం డుమ్మా కొట్టిండి.

సమ్మెపై చర్చలకు  ఉక్కు యాజమాన్యం డుమ్మా

తీరిక లేదని, ఎవరూ హాజరు కాలేమని ఆర్‌ఎల్‌సీకి లేఖ

తీవ్ర నిరాశకు గురైన కాంట్రాక్టు కార్మికులు

ప్రజాప్రతినిధులను కలవాలని నిర్ణయం

జూన్‌ 10న మరోసారి చర్చలు: ఆర్‌ఎల్‌సీ

విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):

కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ (ఆర్‌ఎల్‌సీ)తో శుక్రవారం నగరంలో జరగాల్సిన చర్చలకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం డుమ్మా కొట్టిండి. ఇంతకుముందు జరిగిన సమావేశానికి కూడా కేవలం మేనేజర్‌ స్థాయి అధికారిని పంపించి, చర్చలపై ఆసక్తి లేదన్నట్టుగా యాజమాన్యం వ్యవహరించింది. ఈసారి చర్చలకు ఉన్నత స్థాయి అధికారిని పంపాలని రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ సూచించగా, అసలు హాజరు కావడానికే తీరిక లేదంటూ శుక్రవారం లేఖ పంపింది. వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ వారంతా ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ముందుగానే నోటీసు ఇచ్చారు. అయినా ఉక్కు యాజమాన్యం స్పందించలేదు. పైగా విధులకు హాజరు కావడం లేదంటూ మరో రెండు వేల మంది గేట్‌ పాసులను నిలిపివేయడంతో కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. అయితే 13 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్లో దాదాపుగా ఎనిమిది వేల మంది వరకు విధులకు హాజరవుతున్నారు. తొలగించిన కార్మికులు, వారికి మద్దతుగా మరికొందరు మాత్రమే సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమణ కోసం వారితో చర్చలు జరిపేందుకు యాజమాన్యం ముందుకు రావడం లేదు. ఈ నెల 20వ తేదీ వరకు ఎవరినీ తొలగించబోమని హామీ ఇచ్చి, ఆ గడువు దాటిన తరువాత మరికొంతమందిని ఆపేసింది. ఇక వారి అవసరం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం సమస్య పరిష్కారానికి ఆర్‌ఎల్‌సీ చర్చలకు ఆహ్వానించగా.. దానికి కూడా ప్లాంట్‌ యాజమాన్యం స్పందించడం లేదు. కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభావం ప్లాంటుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అడ్మిన్‌ భవనం వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో భారీ ఎత్తున మోహరించి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని లేఖలో పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్లాంటుకు రక్షణ కల్పించడంతో పాటు ఉత్పత్తికి విఘాతం కలగకుండా వివిధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు అప్పగిస్తున్నామని, వారంతా రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారని, అంతా ఆయా విధుల్లో తీరిక లేకుండా ఉన్నందున చర్చలకు రాలేకపోతున్నామని, చర్చలకు మరో తేదీని సూచించాలని కోరింది. అయితే చర్చలకు వస్తే.. తీసేసిన కార్మికులకు గంగవరం పోర్టు మాదిరిగా నష్టపరిహారం కోరాలని భావించిన కాంట్రాక్టు కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా ఆర్‌ఎల్‌సీ జూన్‌ 10న మరోసారి చర్చలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ప్రజాప్రతినిధులను కలుస్తాం: కాంట్రాక్టు కార్మికులు

ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం తన మొండి పట్టుదలను వీడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి పరిష్కారం కోరుతామని వారు తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 01:09 AM