Share News

నష్టాల్లోకి ఉక్కు

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:04 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు మళ్లీ నష్టాలు మొదలయ్యాయి.

నష్టాల్లోకి ఉక్కు

  • ఏప్రిల్‌, మే నెలల్లో మాత్రమే లాభాలు

  • జూన్‌లో రూ.121 కోట్ల నష్టం

  • జూలైలో మరో రూ.182 కోట్లు...

  • ఆగస్టు నెలలోనూ అదే పరిస్థితి?

  • గాడిన పెట్టడంలో యాజమాన్యం వైఫల్యం

  • ముడి పదార్థాలు సక్రమంగా అందకపోవడంతో తగ్గిన ఉత్పత్తి

  • అదే సమయంలో పెరిగిన ఉత్పత్తి వ్యయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు మళ్లీ నష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక సాయం అందిస్తే పూర్తిసామర్థ్యంతో ప్లాంటును నడిపించి, లాభాల్లోకి తెస్తామని చెప్పిన యాజమాన్యం ఆ మేరకు ఫలితాలు సాధించలేకపోతోంది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్పత్తి వ్యయం పెంచేస్తోంది. లక్ష్య సాధన కోసం అధికారులను, కార్మికులను ప్రోత్సహించి, ఉత్సాహపరచాల్సిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా పనిచేస్తోంది. ఉద్యోగులపై పనిభారం పెంచేసింది. వారి జీతభత్యాల్లో ప్రతి నెలా కోత పెడుతోంది. ఉద్యోగులు భయంతో పనిచేసే పరిస్థితి తీసుకువచ్చింది. ఈ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విప్పకపోవడమే విచిత్రం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే...కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం ‘స్టీల్‌’ అనేది వ్యూహాత్మక రంగం కాదు. అందుకే విశాఖ ఉక్కును విక్రయించాలని 2021లో నిర్ణయం తీసుకుంది. అప్పటికి విశాఖ ఉక్కు రూ.వేయి కోట్ల లాభంలో ఉంది. నష్టాల కారణంగా దీనిని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారనేది తప్పుడు ప్రచారం.

గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో స్టీల్‌ ప్లాంటు రూ.3,444 కోట్ల నష్టాలను ప్రకటించింది. సెప్టెంబరులో ఇన్‌చార్జి సీఎండీగా సక్సేనా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సంస్కరణల పేరుతో ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. అయినా నష్టాలు కొనసాగాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొదటి నెల ఏప్రిల్‌లో రూ.74 కోట్ల లాభం వచ్చింది. మే నెలలో రూ.52 కోట్ల లాభం వచ్చింది. జూన్‌లో రూ.121 కోట్ల నష్టం వచ్చింది. జూలైలో మరో రూ.182 కోట్ల నష్టం వచ్చింది. ఆగస్టు నెలలో ఉత్పత్తి తగ్గిపోయింది. దాంతో ఈ నెల కూడా నష్టాలే వస్తాయంటున్నారు.

ఉత్పత్తిని చూసుకుంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలాకాలం రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)లనే నడిపారు. ఏప్రిల్‌ నెలలో 4.2 లక్షల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేశారు. మే నెలలో కూడా అదే ఉత్పత్తి వచ్చింది. జూన్‌లో 4.21 లక్షల టన్నులు తీసుకువచ్చారు. జూన్‌ చివరి వారంలో మూడో బ్లాస్ట్‌ఫర్నేస్‌ను ప్రారంభించడంతో జూలైలో ఉత్పత్తి పెరిగి 5.02 లక్షల టన్నులకు చేరింది. అమ్మకాల విషయానికి వస్తే ఏప్రిల్‌లో రూ.1,482 కోట్లు, మే నెలలో రూ.1,678 కోట్లు, జూన్‌లో రూ.1,636 కోట్లు, జూలైలో రూ.1,9798 కోట్లు విలువైన ఉత్పత్తులు విక్రయించారు.

జూలైలో వెళ్లిపోవాలని ముందుగానే బీఎఫ్‌-3 ప్రారంభం

స్టీల్‌ప్లాంటుకు ఇన్‌చార్జి సీఎండీగా ఉన్న సక్సేనా బ్లాస్ట్‌ఫర్నేస్‌-3ను ప్రారంభించేసి జూలై నెలలో సొంత సంస్థకు వెళ్లిపోవాలని భావించారు. నవంబరులో ఆయన రిటైర్‌మెంట్‌ ఉందని సమాచారం. కాంట్రాక్టు వర్కర్లను వేల సంఖ్యలో తీసేసిన నేపథ్యంలో వర్షాకాలంలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని ఉద్యోగ వర్గాలు ముందునుంచీ చెబుతున్నాయి. అయితే సీఎండీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనే హడావిడిలో దానిని ప్రారంభింపజేశారని, తగినన్ని ముడిపదార్థాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇదిలావుండగా ఒకేసారి 40 విభాగాలను ప్రైవేటుకు ఇవ్వడానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనలు ఇవ్వడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. ఉద్యోగులలో అశాంతిని నెలకొల్పి వెళ్లిపోతానంటే కుదరదని, రిటైర్‌మెంట్‌ వరకూ ఇక్కడే ఉండాలని ఇన్‌చార్జి సీఎండీని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించిందని తెలిసింది. ఇప్పుడు ముడి పదార్థాలు అందుబాటులో లేక ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు స్టీల్‌ తయారీకి పెల్లెట్లను, కోక్‌ను బయట కొనడం వల్ల ఉత్పత్తి వ్యయం పది శాతం పెరిగిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, దానికి తగ్గట్టు వ్యయం ఎందుకు తగ్గలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 23 , 2025 | 01:04 AM