Share News

ఉక్కు బీఎఫ్‌ 2, 3 విభాగాల్లో నిలిచిన ఉత్పత్తి

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:28 AM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌) 2, 3 విభాగాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

ఉక్కు బీఎఫ్‌ 2, 3 విభాగాల్లో నిలిచిన ఉత్పత్తి

ముడి సరకు కొరతే కారణం

ఉక్కుటౌన్‌షిప్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌) 2, 3 విభాగాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉత్పత్తికి అవసరమైన ముడి సరకు లేకపోవడంతో ప్లాంట్‌లో ఉన్న మూడు ఫర్నేస్‌లలో ఒకదానిలో మాత్రమే ఉత్పత్తిని కొనసాగిస్తూ.. మిగిలిన రెండు ఫర్నేస్‌లను డౌన్‌ చేశారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు బీఎఫ్‌ 2 (కృష్ణ), బీఎఫ్‌- 3 (అన్నపూర్ణ) విభాగాల్లో ఉత్పత్తి జరగలేదు. బీఎఫ్‌ -1 (గోదావరి)లో కేవలం 5,198 మెట్రిక్‌ టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి జరిగింది. ఆదివారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కొంతకాలం కిందటి వరకు ప్లాంట్‌ 1, 2 విభాగాల్లో ఉత్పత్తి జరిగేది. ఇటీవల మూడో ఫర్నేస్‌ను ప్రారంభించారు. దీనివల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతుందని భావించారు. కొద్దిరోజులపాటు ఉత్పత్తి ఆశాజనకంగానే జరిగింది. కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. శనివారం నుంచి రెండు ఫర్నేస్‌లలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో ఈ ప్రభావం ప్లాంట్‌లోని మిగతా విభాగాలపై పడింది. ఫలితంగా వాటిల్లో కూడా ఉత్పత్తి తగ్గిపోయింది. హాట్‌మెటల్‌ హీట్‌ (పెద్ద సైజు కలిగిన ఇనుప కడ్డీలు) తయారయ్యే ఎస్‌ఎంఎస్‌ (స్టీల్‌ మెల్ట్‌షాప్‌)లో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరుగంటల వరకు కేవలం 45 హీట్లు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌కు రా మెటీరియల్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మిక నాయకులు కోరుతున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:28 AM