ఉక్కు సెగలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:57 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం అగ్నిగుండంగా మారుస్తోంది.
కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేని వైనం
ప్రైవేటీకరణ యోచనను పక్కనపెట్టామంటూనే ఒక్కో విభాగం నిర్వహణ బయట సంస్థలకు అప్పగింత
ఉద్యోగులు భారీగా తగ్గింపు?
రాబోయే రోజుల్లో పర్యవేక్షణకే పరిమితం
కార్మిక సంఘాల ఆందోళన
గంగవరం పోర్టు విస్తరణకు స్టీల్‌ప్లాంటు భూములు?
జిందాల్ స్టీల్‌కు పోటీ లేకుండా ముందస్తు ప్రణాళిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం అగ్నిగుండంగా మారుస్తోంది. నిత్యం ఏదో కొత్త సమస్యను సృష్టిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాల్లో అలజడి రేపుతోంది. ప్రైవేటీకరణ ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టామని, ప్లాంటును లాభాల బాటలోకి తేవడానికి యత్నిస్తున్నామని కేంద్రం చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు.
ప్లాంటులో ఉద్యోగులను కుదించే ప్రక్రియను గత ఆరు నెలలుగా వేగవంతం చేశారు. వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) ద్వారా ఫిబ్రవరిలో 1,140 మందిని ఇంటికి పంపించేశారు. మళ్లీ రెండోసారి రెండు నెలల క్రితం వీఆర్‌ఎస్ ప్రకటించారు. ఈసారి మరో వేయి మందిని తీసేస్తారంటున్నారు. ఇక కాంట్రాక్టు వర్కర్లలో 4,500 మందిని మే నెలలో తొలగించారు. ఈ ఆరు నెలల్లో రిటైరైన వారితో కలుపుకొంటే ఏడు వేల మంది తగ్గిపోయారు. ఐదేళ్ల నుంచి పూర్తిగా రిక్రూట్‌మెంట్ ఆపేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నదని, దానిని తగ్గించడానికే ఇవన్నీ చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు. అయితే ఉద్యోగుల భత్యాల్లో కోతలే కనిపిస్తున్నాయి గానీ ఇతర ముడి పదార్థాల వ్యయం తగ్గించిన దాఖలాలు లేవు. పైగా పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడుపుతామని స్టీల్ తయారీకి అవసరమైన పెల్లెట్లను గతం కంటే ఎక్కువ ధర పెట్టి లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నారు. వాటిని సొంతంగా తయారు చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ బయట కొంటున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం గతం కంటే పెరిగిందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
విభాగాల వారీగా ప్రైవేటీకరణ
ప్లాంటును ప్రైవేటీకరించబోమని ఒకవైపు చెబుతూనే మరో వైపు ఒక్కో విభాగాన్ని ‘నిర్వహణ’ పేరుతో ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి ‘ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన’ (ఈఓఐ)లు జారీచేస్తున్నారు. ముందు రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు, ఆ తరువాత సింటర్ ప్లాంటు, ఆపై ఫైర్ డిపార్టుమెంట్, తాజాగా థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణకు ఈఓఐలు ఇచ్చారు. శనివారం రాత్రి ఏకంగా మరో 32 విభాగాలు ప్రైవేటుకు ఇస్తామని ఈఓఐలు జారీచేశారు. అంటే ప్లాంటులో దాదాపుగా 80 శాతం విభాగాలు ప్రైవేటుకు ఇవ్వడానికి సిద్ధమైనట్టు అర్థమవుతోంది. దీనిపై ఇప్పటివరకూ ఉద్యోగ సంఘాలతో గానీ, కార్మిక సంఘాలతో గానీ చర్చించలేదు. అంతా ఏకపక్షంగా సాగిపోతోంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో విభాగాలన్నీ పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేసి, వేల సంఖ్యలో ఉన్న శాశ్వత ఉద్యోగులను వందల్లోకి తీసుకువచ్చి, వారిని పర్యవేక్షణకు ఉపయోగిస్తారని చెబుతున్నారు. దీనివల్ల నిర్వహణ వ్యయం తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని అంటున్నారు.
చాప కింద నీరులా స్టీల్ ప్లాంటును క్రమంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే ఇవన్నీ చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు నిర్వహణలో పనితీరు బాగా లేదని, ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆ తరువాత ప్లాంటును అమ్మకానికి పెడతారని, అప్పుడు కార్పొరేట్ సంస్థలు తక్కువ ధరకు విశాఖ స్టీల్‌ను ఎగరేసుకుపోతాయని, అదే వారి ప్రణాళిక అని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల సంఖ్య వేల నుంచి వందలకు తగ్గించడం వల్ల కార్మిక సంఘాలు బలహీనమవుతాయని, అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆందోళన చేయడం, అడ్డుపడడం తగ్గుతుందనేది యాజమాన్యం ఆలోచనగా భావిస్తున్నారు.
ఒకరికి భూములు...ఇంకొకరికి ప్లాంటు
స్టీల్‌ప్లాంటు భూములపై అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం కన్ను పడిందంటున్నారు. పోర్టు విస్తరణకు కనీసం రెండు వేల ఎకరాలు అవసరమని, ప్రస్తుతం రైల్వే లైన్లకు కూడా భూములు కావాలని అడుగుతోందంటున్నారు. రెండు వారాల క్రితం రైల్వే అధికారులు వెళ్లి రైల్వే లైన్లకు అవసరమైన భూములు పరిశీలించారు. స్టీల్ ప్లాంటుకు ఏ విధంగాను సహకరించని అదానీ యాజమాన్యానికి భూములు ఎలా ఇస్తారని చాలాకాలంగా కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు సంఘాలు ఆందోళన చేయకుండా ఆంక్షలు పెట్టారు. ప్రశ్నించే వారికి నోటీసులు ఇస్తున్నారు. ఏదో ఒకటి చేసి తొలుత అదానీకి అవసరమైన భూములు అప్పగిస్తారని, ఆ తరువాత పనితీరు ఆధారంగా ప్లాంటు విలువ తగ్గేలా చేసి...తక్కువ ధరకు జిందాల్ స్టీల్‌కు అప్పగిస్తారని, దాని కోసం ప్రణాళిక ప్రకారం ఇవన్నీ చేస్తున్నారని ఉక్కు కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేటీకరణ నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలి
అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల డిమాండ్
ప్రధాన పరిపాలన భవనం ముందు ధర్నా
ఉక్కుటౌన్‌షిప్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటులోని కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం విడుదల చేసిన నోటిఫికేషన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా సోమవారం ప్లాంటు ప్రధాన పరిపాలనా విభాగం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం అనుమతితోనే ఉక్కు యాజమాన్యం కీలక విభాగాల్లో ఈవోఐ ప్రకటించిందని ఆరోపించారు. గొప్ప ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు...దానివల్ల కార్మిక వర్గానికి జరిగిన లాభం శూన్యమన్న సంగతిని గ్రహించాలన్నారు. ప్లాంటులో వీఆర్‌ఎస్ ద్వారా వందల మంది ఉద్యోగులను బయటకు పంపేశారని, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నారన్నారు. ఇప్పుడు కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. స్టీల్‌ప్లాంటును ఏదోవిధంగా నాశనం చేద్దామన్న కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు కేఎస్‌ఎన్ రావు, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, పీవీ రమణమూర్తి, యు.రామస్వామి, నీరుకొండ రామచంద్రరావు, పి.శ్రీనివాసరాజు, గంగాధర్, వి.ప్రసాద్, కారు రమణ, బీఎన్ రాజు, బంటు రాము, బి.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.