ప్రకృతి ఒడిలో బస
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:23 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలోని కృష్ణాపురం వనాల మధ్యలో అటవీ శాఖ అతిథుల కోసం నిర్మించిన వనవిహారి సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నది.
ఆకట్టుకుంటున్న వనవిహారి
అందుబాటులో టెంట్లు, వాష్‌రూమ్స్, కేఫ్‌టేరియా
ముందుగా బుక్ చేసుకునేందుకు రిజర్వేషన్ సదుపాయం
చింతపల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలోని కృష్ణాపురం వనాల మధ్యలో అటవీ శాఖ అతిథుల కోసం నిర్మించిన వనవిహారి సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. కూటమి ప్రభుత్వం వనవిహారిలో సందర్శకులకు అదనపు సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పర్యాటకులు వన విహారిలో బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి ఐదేళ్లుగా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. పర్యాటక సీజన్‌లో లంబసింగిని లక్షల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టు వన విహారిని అటవీ శాఖ అధికారులు గత ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి-నర్సీపట్నం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పైన్ తోటల్లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. కృష్ణాపురం పైన్ తోటలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే సందర్శకులు తోటల వద్ద ఆగి ఫొటోలు తీసుకొని, కొంత సమయ విశ్రాంతి తీసుకుని వెళుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు కృష్ణాపురం పైన్ తోటల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు వన విహారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన రూ.25 లక్షలతో సహజ సిద్ధంగా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అనువుగా వన విహారిని రూపొందించారు.
అందుబాటులో ఉన్న సదుపాయాలు
కృష్ణాపురం ఎకో టూరిజం ప్రాజెక్టులో పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు బస చేసేందుకు పైన్ తోటల మధ్యలో 15 సింగిల్ టెంట్లు, 10 డబుల్ టెంట్లు, క్యాంటీన్ ఏర్పాటు చేశారు. రన్నింగ్ వాటర్, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. మెయిన్ గేట్ పూర్తిగా ఉడ్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. వన విహారి వినోదం కోసం ఆర్చరీ, ఊయలలు ఏర్పాటు చేశారు. వాకింగ్ చేసేందుకు 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పాత్ ఏర్పాటు చేశారు. భోజనాలు, అల్పాహారం తీసుకునేందుకు అనువుగా ఉడ్ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. వన విహారి లోపల, బయట ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులతో అలంకరించారు.
ప్రత్యేక ఆకర్షణగా కేఫ్‌టేరియా
వన విహారిలో అతిథుల కోసం చెట్ల మధ్యలో కేఫ్‌టేరియా నిర్మించారు. సందర్శకులు ఇక్కడ కూర్చొని అల్పాహారం, భోజనాలు చేసేందుకు అనువుగా సిద్ధం చేశారు. అతిథుల ఆర్డర్ మేరకు వంటకాలను సిద్ధం చేసి వేడి వేడిగా అందించడం ప్రత్యేకత. ప్రధానంగా చిరుధాన్యాలతో తయారు చేసిన ఆదివాసీ సంప్రదాయ వంటకాలు కేఫ్‌టేరియాలో అందుబాటులో ఉన్నాయి.
ఏడాది పొడవునా సందర్శనకు అనువుగా..
వన విహారిని ఏడాది పొడవునా సందర్శించేందుకు అనువుగా అటవీ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. స్థానికులు వన భోజనాలు చేసేందుకు కొంత విస్తీర్ణం కేటాయించారు. ఎకో టూరిజం ప్రాజెక్టు లోపల వివిధ రకాల పూల మొక్కలు, క్రోటాన్స్ పెంచుతున్నారు. ఓపెన్ విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకో టూరిజంలో విశాలమైన పార్కింగ్‌తో పాటు పర్యాటకుల భద్రత కోసం 24 గంటలు టాస్క్‌ఫోర్సు ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు.
రిజర్వేషన్ సదుపాయం
పర్యాటక సీజన్‌లో సందర్శకులు వనవిహారిలో టెంట్లు ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పర్యాటకులు రిజర్వేషన్ కోసం 9908484265 నంబర్‌కి ఫోన్ చేయవచ్చు. డబుల్ టెంట్ రూ.1,200, సింగల్ టెంట్ రూ.800 ధరలకు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ రుసుము రూ.30, కారు పార్కింగ్‌కి రూ.20, ఫొటో షూటింగ్‌కి రూ.1000 చెల్లించాల్సి వుంది. పర్యాటకులకు అవసరమైన పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలతో వచ్చే పర్యాటకులకు పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. అలాగే ఓపెన్ ఏరియాలో విందు, వినోద కార్యక్రమాలు, వన భోజనాలు నిర్వహించుకోవచ్చు.