కోటనరవ పార్కు స్థలంపై యథాతథ స్థితి
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:19 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధి కోటనరవ గ్రామంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో 180 గజాల పార్కు స్థలం విషయంలో యథాతథ స్థితి పాటించాలని పురపాలక శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అయితే పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి, వారి స్థలాన్ని జీవీఎంసీ తీసుకొనే వ్యవహారాన్ని కౌన్సిల్ సమావేశంలో ఉంచి నిర్ణయం తీసుకొనేందుకు జీవీఎంసీకి వెసులుబాటు ఇచ్చింది.
భూ మార్పిడి వ్యవహారాన్ని జీవీఎంసీ కౌన్సిల్‌లో పెట్టండి
హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధి కోటనరవ గ్రామంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో 180 గజాల పార్కు స్థలం విషయంలో యథాతథ స్థితి పాటించాలని పురపాలక శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అయితే పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి, వారి స్థలాన్ని జీవీఎంసీ తీసుకొనే వ్యవహారాన్ని కౌన్సిల్ సమావేశంలో ఉంచి నిర్ణయం తీసుకొనేందుకు జీవీఎంసీకి వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
విశాఖపట్నం జిల్లా, కోటనరవ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 10/9బీ ఈడబ్ల్యూఎస్ కాలనీలో 180 గజాల పార్కు స్థాలాన్ని ప్రైవేటు వ్యక్తి మల్ల రమణకు ఇచ్చి, వారి స్థలాన్ని జీవీఎంసీ తీసుకొనేందుకు అనుమతిస్తూ ఈ ఏడాది మార్చి 5న పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా...పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి యాదవ్ వాదనలు వినిపించారు. పార్కు స్థలాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించడానికి వీల్లేదన్నారు. పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో పరస్పర మార్పిడి చేసుకొనేందుకు...కౌన్సిల్ సమావేశంలో ఉంచి ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. కౌన్సిల్ ఆమోదం లేకుండానే పురపాలకశాఖ ఏకపక్షంగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. అనధికార ప్రతివాది తరపున న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఉన్న రోడ్డును వెడల్పు చేసేందుకు వీలుగా పరస్పర స్థల మార్పిడి నిమిత్తం జీవీఎంసీకి దరఖాస్తు చేశామన్నారు. ఈ వ్యవహారంపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.