సచివాలయాల్లో స్టేషనరీ కొరత
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:32 AM
సచివాలయాలకు స్టేషనరీ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిల్లు కడితే రశీదు ఉండదు...
చివరకు సర్టిఫికెట్లు కూడా బయట ప్రింటు తీసుకోవాల్సిన పరిస్థితి
కంప్యూటర్లు, ప్రింటర్ల మొరాయింపు
ఇది సచివాలయాల తీరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సచివాలయాలకు స్టేషనరీ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ డబ్బులు చెల్లించే ఏ వ్యవహారానికీ రశీదులు లభించడం లేదు. ఆఖరుకు ప్రభుత్వం జారీచేసే సర్టిఫికెట్లు కూడా బయటే ప్రింట్ తీసుకోవలసి వస్తోంది. సచివాలయ వ్యవస్థను మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో వాటి పనితీరును ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్ల యజమానులు అనేక మంది ఇంటి పన్ను, నీటి పన్ను కట్టడానికి జీవీఎంసీ జోనల్ కార్యాలయాలకు కాకుండా సచివాలయాలకే వస్తున్నారు. ఇక్కడ ఫోన్ పేతో చెల్లించుకోవచ్చు. నగదు అవసరం లేదు. అయితే వీటిని ప్రారంభించిన మొదట్లో ప్రతి చెల్లింపునకు కంప్యూటర్ ప్రింట్‌తో కూడిన రశీదు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రింటర్లు మూలకు చేరడంతో రశీదులు ఇవ్వడం లేదు. దానిపై వినియోగదారుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అదేవిధంగా కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సచివాలయం సిబ్బంది వచ్చి వెరిఫై చేస్తారు. అవి మంజూరైన తరువాత ఇంతకు ముందు సచివాలయాల్లోనే ప్రింట్ తీసి ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని మీ-సేవా కేంద్రాలకు వెళ్లి తీసుకోవలసి వస్తోంది. వీటిపై ఎంతమంది ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండడం లేదు.
ఇదీ పరిస్థితి...
ఫ గ్రేటర్ 98వ వార్డు పరిధిలోని సచివాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం ఏడు సచివాలయాల్లో గ్రేడ్-2 గ్రామ రెవెన్యూ అధికారులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
ఫ సచివాలయాలను రీ గ్రూపింగ్ చేసి కస్టర్లుగా విభజించినా గోపాలపట్నం ప్రాంతాల్లో మార్పు కనిపించలేదు. సగం మంది సిబ్బంది ఫీల్డ్‌లోనే ఉంటున్నారు. ఆ బాధ్యత లేకుంటే సగానికి పైగా సిబ్బంది ఖాళీయే.
ఫ 26, 43వ వార్డుల పరిధిలోని 241, 243 సచివాలయాలను ఇన్‌చార్జులతో నెట్టుకొస్తున్నారు. సిబ్బంది లేక ప్రజలకు అందించాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడు నెలలుగా కంప్యూటర్లు పనిచేయడం లేదు.
ఫ జీవీఎంసీ 54వ వార్డు దుర్గానగర్ సచివాలయంలో వీఆర్వో, శానిటరీ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టేషనరీ కొరత ఎక్కువగా ఉంది. కంప్యూటర్స్ పనిచేయడం లేదు.
ఫ పెందుర్తి పరిధిలో రీగ్రూపింగ్ చేసిన తరువాత కొంతమందిపై పని భారం పెరిగింది. మరికొంతమందికి అసలు పని లేకుండా పోయింది.
ఫ మహారాణిపేట పరిధిలోని సచివాలయాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు మూలకు చేరాయి. ధ్రువపత్రాలు, ఇతర సర్టిఫికెట్లు బయట ప్రింట్ తీసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు.
--------------------------------------------
జీవీఎంసీ పరిధిలో మొత్తం వార్డు సచివాలయాలు 572
మొత్తం కార్యదర్శులు 4386
వివిధ కారణాలతో విధులకు దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్నవారు 225
--------------------------------------------
కాలక్షేపం చేసేవారే అధికం
కొందరిపైనే పనిభారం...
రేషనలైజేషన్ తర్వాత రెండు సచివాలయాలకు ఒకరే ప్లానింగ్, ఎమినిటీ కార్యదర్శులు
వారిపై విపరీతమైన ఒత్తిడి
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):
వార్డు సచివాలయాల్లో కొందరు పనిభారంతో సతమతమవుతుంటే, మరికొందరు మాత్రం ఖాళీగా ఉంటున్నారు. జీవీఎంసీ పరిధిలో 572 వార్డు సచివాలయాలు ఉండగా, 4,386 మంది కార్యదర్శులు ఉన్నారు. ఇందులో 225 మంది వివిధ కారణాలతో విధులకు దీర్ఘకాలంగా హాజరుకావడం లేదు. వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో ప్రతిచోట ఒక అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీస్, హెల్త్ సెక్రటరీ (ఏఎన్‌ఎం), వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీతోపాటు ప్రతి నాలుగు సచివాలయాలకు ఒకరు చొప్పున వీఆర్‌ఓలను నియమించారు. మూడు నెలల కిందట వార్డు సచివాలయాల్లో సిబ్బందిని రేషనలైజేషన్ చేశారు. ప్లానింగ్, ఎమినిటీస్ సెక్రటరీలకు రెండేసి వార్డు సచివాలయాల బాధ్యతలను అప్పగించారు. వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆకతాయిలు, పేకాటరాయుళ్లు, వ్యభిచారం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు విక్రయం, వినియోగం, రవాణా వంటివాటికి సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. అలాగే చోరీల నియంత్రణకు తీసుకోవాల్సి జాగ్రత్తలు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. అయితే కొద్దిమంది మినహా మహిళా పోలీసులు ఎవరూ ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వార్డు శానిటేషన్ సెక్రటరీలు తమకు కేటాయించిన ప్రాంతంలో ఉదయం ఆరు నుంచే తిరుగుతూ గెడ్డల నిర్వహణ, చెత్త సేకరణ, క్లాప్ వాహనాల పనితీరు, పారిశుధ్య సిబ్బంది హాజరు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ కొద్దిమంది మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన జాబ్‌చార్ట్ ప్రకారం పనిచేస్తున్నారని, మిగిలినవారు మాత్రం పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వార్డు ఎమినిటీ, ప్లానింగ్ సెక్రటరీలతోపాటు హెల్త్ సెక్రటరీలకు మాత్రం పనిభారం ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.