Share News

ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:30 PM

పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్‌- 14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
ప్రథమ స్థానంలో నిలిచిన విశాఖపట్నం బాలుర జట్టుతో డీఈవో అప్పారావునాయుడు

బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించిన విశాఖ జట్టు

ద్వితీయ స్థానంలో చిత్తూరు

బాలికల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న చిత్తూరు జట్టు

ద్వితీయ స్థానంలో విశాఖపట్నం

లంకెలపాలెం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్‌- 14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు రసవత్తరంగా సాగాయి. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాలుర, బాలికల విభాగంలో 26 జట్లు పాల్గొన్నాయి. లీగ్‌ దశ నుంచి 8 జట్లు చొప్పున ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి. ఉత్కంఠభరితంగా సాగిన ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగు జట్లు చొప్పున సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించి ఫైనల్స్‌లో తలపడ్డాయి. బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖపట్నం, చిత్తూరు జిల్లా జట్ల మధ్య హోరాహోరిగా సాగిన పోరులో విశాఖపట్నం జట్టు విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానంలో చిత్తూరు నిలిచింది. గుంటూరు జిల్లా జట్టుకు తృతీయ స్థానం దక్కింది. అలాగే బాలికల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన చిత్తూరు, విశాఖ పట్నం జట్ల మఽధ్య జరిగిన పోటీలో చిత్తూరు జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, విశాఖపట్నం జట్టుకు ద్వితీయ స్థానం దక్కింది. తృతీయ స్థానంలో శ్రీకాకుళం జట్టు నిలిచింది. విజేతలకు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు, 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌లు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్‌, మొల్లి ముత్యాలనాయుడు, డిప్యూటీ డీఈవో ఎం.అప్పారావు, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కేఎం నాయుడు, హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శి ఎంవీ నాగేశ్వరరావు, పీడీలు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:30 PM