రాష్ట స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:41 AM
స్థానిక డీఏవీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఏపీ జెన్‌కో రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ప్రారంభించారు.
- ఉత్సాహంగా పాల్గొన్న జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం క్రీడాకారులు
సీలేరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): స్థానిక డీఏవీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఏపీ జెన్‌కో రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ ఏపీఎస్‌ఈబీ బోర్డు జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచి మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దాలని జెన్‌కో స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేలును కోరారు. సీలేరు కాంప్లెక్సు ఓఅండ్‌ఎం సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నకామేశ్వరరావు మాట్లాడుతూ సీలేరులో చాలా సంవత్సరాల తరువాత రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ర్టిసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ మేనేజర్ కుమార్ వడివేలు మాట్లాడుతూ సీలేరు జెన్‌కో స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సీలేరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. కబడ్డీలో 16 జట్లు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో 17 జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. టగ్ ఆఫ్ వార్ పోటీలను బుధవారం ప్రారంభిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎలక్ర్టిసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఇన్‌చార్జి స్పోర్ట్స్ అధికారి రామకృష్ణ, ఈఈలు రాజేంద్రప్రసాద్, నాగశ్రీనివాసరావు, సీలేరు స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం క్రీడాకారులు పాల్గొన్నారు.
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
ఏపీ జెన్‌కో రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ కబడ్డీ పోటీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం విజయనగరం, ఒంగోలు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. విజయనగరం జట్టు 24 పాయింట్ల తో విజయం సాధించింది. ఒంగోలు జట్టు 17 పాయింట్లు సాధించి ఓటమి చెందింది. అలాగే లోయర్ సీలేరు, తిరుపతి జట్లు తలపడగా, లోయర్ సీలేరు జట్టు 31 పాయింట్లతో విజయం సాధించగా, తిరుపతి జట్టు 12 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. అనంతరం పల్నాడు, శ్రీకాకుళం జట్లు తలపడగా, పల్నాడు జట్టు 32 పాయింట్ల విజయం సాధించగా, శ్రీకాకుళం జట్టు 17 పాయింట్లతో ఓటమి పాలైంది. సీలేరు, ఎన్‌టీపీసీ జట్లు తలపడగా, సీలేరు జట్టు 39 పాయింట్ల్లతో విజయం సాధించగా, ఎన్‌టీపీసీ జట్టు 36 పాయింట్లతో ఓటమి పాలైయింది.