ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:25 AM
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి.
విజయనగరం బాలురు, బాలికల జట్లకు ప్రథమ స్థానం
కృష్ణాదేవిపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన బాలురు, బాలిక జట్లు ప్రథమ స్థానం సాధించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీల్లో 26 జట్లు పాల్గొన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించగా, ద్వితీయ స్థానం గుంటూరు జిల్లా, తృతీయ స్థానం నెల్లూరు జిల్లా కైవసం చేసుకున్నాయి. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించగా, ద్వితీయ స్థానం చిత్తూరు జిల్లా, తృతీయస్థానం గుంటూరు జిల్లా దక్కించుకున్నాయి. విజేతలకు సోమవారం నర్సీపట్నం టౌన్ సీఐ జి.గోవిందరావు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ, నాతవరం టీడీపీ మండల అధ్యక్షులు చిటికెల తారకవేణుగోపాల్, నందిపల్లి రమణ, నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు, ఎంఈవో కృష్ణప్రసాద్, సర్పంచ్ లోచల సుజాత, సాఫ్ట్‌బాల్ సంఘం నాయకులు మామిడి రమణ, ఎంవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.