నేటి నుంచి ఉపమాకలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:35 AM
మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉత్సవ కావిడితో ఘనంగా ప్రారంభం కానున్నాయి.
నిత్యం తిరువీధి సేవ
2వ తేదీన పూర్ణాహుతితో ముగింపు
నక్కపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉత్సవ కావిడితో ఘనంగా ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల రెండో తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల తొలిరోజు ఉదయం ఉత్సవ కావడి ఊరేగింపు, సాయంత్రం పుణ్యాహవాచనం, పుట్టమన్ను సేవ, రాత్రి తిరువీధి సేవ, విశేష హోమాలు జరుగుతాయని ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు చెప్పారు. 24వ తేదీన భేరీ పూజ, పెద్దపల్లకీలో తిరువీధి సేవ, మాఢవీధుల్లో అష్టదిక్పాలకుల ఆవాహనం, ధ్వజారోహణం, రాత్రికి శేష తల్ప వాహనంపైతిరువీధి సేవ, 25వ తేదీ ఉదయం రాజాధిరాజ వాహనం, రాత్రి హంస వాహనంపై తిరువీధి సేవ, 26వ తేదీ ఉదయం సప్పరం వాహనం, రాత్రి పెద్ద పల్లకీపై, 27వ తేదీన ఆంజనేయ వాహనం, రాత్రికి లక్క గరుడ వాహనంపై, 28వ తేదీ ఉదయం సప్పరం, రాత్రి రాజాధిరాజ వాహనంపై తిరువీధి సేవ జరుగుతాయి. 29వ తేదీ సాయంత్రం గరుడవాహన సేవ, వసంతోత్సవం, 30వ తేదీ రాత్రి పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ, అక్టోబరు ఒకటో తేదీ సాయంత్రం పుష్కరిణి వద్ద మృగవేట, అనంతరం గజవాహనంపై తిరువీధి సేవ జరుగుతాయి. 2వ తేదీన పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ఆలయం లోపల, బయట విశాలమైన టెంట్లు ఏర్పాటు చేశారు.