Share News

గిరిజనులతో ఎస్పీ మమేకం

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:04 PM

మండలంలోని మారుమూల గ్రామాల్లో ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గిరిజనులతో ఎస్పీ మమేకం
మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్ధార్‌, పక్కన డీఎస్పీ షెహబాజ్‌ అహ్మద్‌

మారుమూల గ్రామాల్లో విస్తృత పర్యటన

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ

ముంచంగిపుట్టు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గ్రామాల్లో ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలుత ఆయన మారుమూల సుత్తిగూడ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామ సమీపంలో మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో సాగు చేస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు. గంజాయికి దూరంగా ఉంటూ వరి సాగుపై గిరిజనులు దృష్టి సారించడం అభినందనీయమన్నారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు చదువుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని ఎస్పీని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. లక్ష్మీపురం పంచాయతీ కేంద్రం వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును నడపాలని, ఇటుగా రహదారి ఉన్నా బస్సు నడవకపోవడంతో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దివ్యాంగుడైన తన కుమారుడికి పింఛన్‌ కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా మంజూరు కావడం లేదని సుత్తిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళ ఎస్పీ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులతో మాట్లాడి బాలుడికి పింఛన్‌ వచ్చే విధంగా చూస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో నిరుద్యోగ యువత జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, ఉద్యోగావకాశాలు కల్పించాలని పలువురు యువకులు కోరారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, పెన్నులు, పెన్సిల్స్‌, స్వీట్లు ఎస్పీ పంపిణీ చేశారు. పలువురు విద్యార్థులతో ఎస్పీ, డీఎస్పీ పుస్తక పఠనం చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ మాట్లాడుతూ సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో పర్యటించానని, పోలీస్‌ అవుట్‌ పోస్టు కావాలని ఈ ప్రాంతవాసులు కోరారని, కానీ వివిధ కారణాల వలన ఏర్పాటు చేయలేకపోయామని ఎస్పీ తెలిపారు. మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకొనేందు ఇక్కడికి వచ్చానన్నారు. చాలా ప్రాంతాల నుంచి గిరిజన నిరుద్యోగ యువత ఉద్యోగావకాశాలు కల్పించాలని తన కార్యాలయానికి వస్తున్నారని, కానీ ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువత గ్రామం విడిచి బయటకు రావడం లేదని తెలిపారు. నిరుద్యోగ యువత తన వద్దకు వస్తే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట పాడేరు డీఎస్పీ షేక్‌ షెహబాజ్‌ అహ్మద్‌, జి.మాడుగుల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావు, సర్పంచ్‌ కె.త్రినాథ్‌, పెదబయలు, పాడేరు ఎస్‌ఐలు రమణ, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:04 PM